ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి: ఇక దయ చేయండి

1 min read

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి: ఇక దయ చేయండి
అరుంధతీ రాయ్

మాకొక ప్రభుత్వం కావాలి. అత్యవసరంగా. తక్షణమే. కాని మాకిప్పుడొక ప్రభుత్వమనేది లేదు. మాకు ఊపిరాడడం లేదు. మా ప్రాణాలు కొడిగట్టిపోతున్నాయి. అందుబాటులో ఉన్న సహాయమైనా అందుకోవడానికి మేం ఏం చేయాలో చెప్పే వ్యవస్థలేవీ పని చెయ్యడం లేదు.

మరి ఏమి చేయవలసి ఉంది? ఈ క్షణాన, ఈ స్థలాన మా కర్తవ్యం ఏమిటి?

మేం 2024 దాకా వేచి ఉండలేం. ఏ విషయానికైనా సరే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసే రోజు ఒకటి వస్తుందనే ఊహే నా బోటివాళ్లకు ఎన్నడూ రాలేదు. వ్యక్తిగతంగా నావరకు నేనైతే, అటువంటి విజ్ఞప్తి చేసే కన్నా జైలుకు వెళ్లడం ఉత్తమం అనుకుని ఉండేదాన్ని. కాని ఇవాళ, మేం మా ఇళ్లలో, వీథుల్లో, ఆస్పత్రుల కార్ పార్కింగ్ స్థలాల్లో, మహా నగరాల్లో, చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో, అడవుల్లో, పంట పొలాల్లో – ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నప్పుడు, ఒక సాధారణ పౌరురాలినైన నేను నా ఆత్మగౌరవాన్ని దిగమింగి, కోట్లాది మంది సహచర పౌరులతో గొంతు కలుపుతున్నాను. అయ్యా, దయచేసి, దయచేసి, ఇంక దయచెయ్యండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం ఇప్పటికైతే పక్కకు తొలగండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి దిగిపోండి.

ఈ సంక్షోభం మీరు తయారు చేసినదే. దీన్ని పరిష్కరించడం మీ చేతుల్లో లేదు. మీరు దీన్ని మరింత దారుణంగా మాత్రమే మార్చగలరు. భయం, విద్వేషం, అజ్ఞానం నిండిన వాతావరణంలో ఈ వైరస్ మరింత బలపడుతుంది. గొంతెత్తి మాట్లాడగలిగిన వాళ్ల గొంతులు మీరు నొక్కేసినప్పుడు ఈ వైరస్ విస్తరిస్తుంది. నిజమైన సత్యం అంతర్జాతీయ ప్రచార సాధానాల్లో మాత్రమే వెలువడేలా మీరు దేశంలోని ప్రచార సాధనాలను లొంగదీసుకున్నప్పుడు ఈ వైరస్ దశదిశలా వ్యాపిస్తుంది. తన పదవీ కాలం మొత్తంలో ఒక్కటంటే ఒక్కటైనా పత్రికా సమావేశం నిర్వహించని, ఇంత భయానకమైన ఉత్పాతం నెలకొన్న సమయంలో కూడ ఎదుటివారి నుంచి ప్రశ్నను స్వీకరించలేని ప్రధాన మంత్రి ఉన్నప్పుడు ఈ వైరస్ మరింత పెచ్చరిల్లుతుంది.

మీరిప్పుడు దిగిపోకపోతే, మాలో వేలాది, లక్షలాది మందిమి అనవసరంగా చనిపోతాం. అందువల్ల, అయ్యా, దయచేసి దిగిపోండి. మీ మూటా ముల్లే సర్దుకోండి. మీరు గౌరవంగా దిగిపోగలిగినప్పుడే దిగిపోండి. మీకు ధ్యానంలో, ఏకాంతంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. మీకు కావలసినది అదే అని మీరే గతంలో అన్నారు. ప్రస్తుతం సాగుతున్న సామూహిక మరణకాండ ఇలాగే కొనసాగితే మీకది కూడా సాధ్యం కాదు.

ప్రస్తుతానికి మీ స్థానాన్ని తీసుకోవడానికి మీ పార్టీలో చాలా మందే ఉన్నారు. ఇటువంటి సంక్షోభ సమయంలో ప్రతిపక్షాలతో సామరస్యంగా ఉండాలని తెలిసినవాళ్లు. మీ పార్టీ నుంచే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుమతి తోనే, ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వాన్ని, ప్రస్తుత సంక్షోభ నిర్వహణా బృందాన్నీ నడపగలరు.

రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రతినిధులను ఎన్నుకోవచ్చు, తద్వారా అన్ని పార్టీలకూ ప్రాతినిధ్యం దొరకవచ్చు. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ కూ ఆ సంక్షోభ నిర్వహణా బృందంలో చోటు ఉండవచ్చు. అలాగే శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణులు, వైద్యులు, అనుభవశాలులైన ఉన్నతాధికారులు ఉండవచ్చు. ఇదంతా మీకు అర్థం కాకపోవచ్చు. కానీ దీన్నే ప్రజాస్వామ్యం అంటారు. మీరనుకుంటున్నారు గాని, ప్రతిపక్ష ముక్త ప్రజాస్వామ్యం అనేది ఉండదు. అలా ఉంటే దాన్ని నిరంకుశత్వం అంటారు. ప్రస్తుత వైరస్ కు నిరంకుశత్వాలంటే చాలా ఇష్టం.

మీరిప్పుడు ఈ పని చేయకపోతే, ప్రస్తుత ఉత్పాతం అంతకంతకూ ఎక్కువగా అంతర్జాతీయ సమస్యగా, ప్రపంచానికే ప్రమాదంగా కనబడుతున్నది గనుక, మీ అసమర్థత ఇతర దేశాలకు మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి, పరిస్థితి చక్కదిద్దే అధికారం చేపట్టడానికి ఒక సాధికార కారణమవుతుంది. మనం కష్టభరితంగా పోరాడి సాధించుకున్న సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుంది. మళ్లీ మన దేశం ఒక వలసగా మారుతుంది. ఇది ఒక తీవ్రమైన ప్రమాద అవకాశం. దాన్ని తోసిపారెయ్యకండి.

కనుక, మహానుభావా, దయచేసి దయచేయండి. మీరు చేయగల అత్యంత బాధ్యతాయుతమైన పని అదే. మా ప్రధానమంత్రిగా ఉండే నైతిక అధికారాన్ని మీరు కోల్పోయారు.

scroll.in నుంచి అనువాదం: ఎన్ వేణుగోపాల్

Total Page Visits: 36 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed