ఫార్మా కంపెనీల‌తో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ క‌మిటీ చ‌ర్చ‌

1 min read

ఫార్మా కంపెనీల‌తో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ క‌మిటీ చ‌ర్చ‌

హైద‌రాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు అవసరమైన మందులు, వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు శుక్ర‌వారం మంత్రి కేటీఆర్ సారథ్యంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ క‌మిటీ.. వ్యాక్సిన్ తయారీదారులు, ఫార్మా సంస్థలతో ప్రగతిభవన్లో సమావేశమైంది. కొవిడ్ సంబంధిత చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్న (రెమ్‌డెసివిర్ వంటి) మందులను తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలతో విస్తృతంగా టాస్క్‌ఫోర్స్ క‌మిటీ చ‌ర్చించింది. ఆ మందుల ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఫార్మా కంపెనీల తో వివిధ అంశాలపై చర్చించిన అనంతరం వ్యాక్సిన్ తయారు చేస్తున్న పలు కంపెనీల ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్ బృందం చర్చలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయా సంస్థల యొక్క వాక్సిన్ స‌ర‌ఫ‌రా పెంపుదలకు ఉన్న అవకాశాలు, వాటికి సంబంధించిన గడువులు, వాక్సిన్ ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా విస్తరించేందుకు అవసరమైన చర్యల వంటి వివిధ అంశాలపైన కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన భారత్ బయోటెక్, బయోలాజికల్- ఈ వంటి వ్యాక్సిన్ తయారీ సంస్థలకు స్థానికంగా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రో- యాక్టివ్ గా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

దీంతోపాటు సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న వివిధ వ్యాక్సిన్లను దేశంలో తయారుచేసే అవకాశాలున్న ఫార్మా కంపెనీలతో కూడా టాస్క్ ఫోర్స్ ఈ రోజు చర్చించింది. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు వ్యాక్సిన్ అందించాలన్న లక్ష్యంతో తమ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, ఇందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తుందని ఈ సందర్భంగా ఆయా కంపెనీలకు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రానికి అవసరమైన వాక్సిన్ ల ప్రొక్యూర్‌మెంట్ అంశం పైన స్థానికంగా ఉన్న కంపెనీలతో పాటు అంతర్జాతీయంగా, అందుబాటులోకి వచ్చిన వివిధ వాక్సిన్ సంస్థలతో కూడా సంప్రదింపులు చేస్తామని తెలిపారు. భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఆయా వ్యాక్సిన్ లను ప్రోక్యూర్ చేసుకునేలా ఇప్పటినుంచే ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించాలని నిర్ణయించింది.

ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశానికి నాట్కో ఫార్మా, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సనోఫి ఇండియా, వర్చ్యు బయోటెక్, గ్లాండ్ ఫార్మా, ఇండియన్ ఇమ్మునోలాజికల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కంపెనీలకి చెందిన పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉన్న ఉన్నతాధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, రాహుల్ బొజ్జా, రాజశేఖర్ రెడ్డి లతో పాటు టిఎస్ఐఐసి ఎండి నరసింహారెడ్డి, శక్తి నాగప్పన్ లు పాల్గొన్నారు.

Total Page Visits: 19 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed