రూ.1.18 కోట్లు కొట్టేసిన నిందితుడి కోసం వేట

1 min read

దారితప్పిన ఇంజినీర్‌!
రూ.1.18 కోట్లు కొట్టేసిన నిందితుడి కోసం వేట
కీలక ఆధారాలు సేకరించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

హైదరాబాద్‌: కోల్‌కతాకు వెళ్లి చైనా కంపెనీల బ్యాంకు ఖాతాల్లోని రూ.1.18 కోట్లు విడుదల చేయించిన నకిలీ సైబర్‌ క్రైమ్‌ ఎస్సై కోసం హైదరాబాద్‌ పోలీసులు వేట మొదలుపెట్టారు. నిందితుడు తన స్నేహితురాలితో ఓ మెట్రో నగరంలో ఉన్నాడని కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో పట్టుబడిన నకిలీ ఎస్సై స్నేహితుడు, బేగంపేటవాసి ఆనంద్‌ చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి గత చరిత్ర, చిరునామా, వ్యవహారశైలి వంటి అంశాలను సేకరించారు. నకిలీ ఎస్సై సూచనలతో రూ.1.18 కోట్లు తీసుకున్న ఆనంద్‌ తన కమీషన్‌ తీసేసుకుని మిగిలిన మొత్తాన్ని ఇతర ఖాతాలకు బదిలీ చేశాడు. ఆ డబ్బు కోల్‌కతాలో వేరే బ్యాంక్‌ ఖాతాలో జమ అయినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలుసుకున్నారు. ఆ నగదును ఎవరు విత్‌డ్రా చేసుకున్నారో తెలపాలంటూ బ్యాంక్‌ అధికారులకు తాఖీదులు పంపించారు.
ఇంజినీరింగ్‌ పూర్తి.. నకిలీ ఎస్సై హైదరాబాద్‌ శివారులోని కార్పొరేట్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం రాక ఆరేళ్ల క్రితం ముంబయికి వెళ్లాడు. కొద్దినెలలు ఉండి మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాడు. పెళ్లి చేసుకుని, కొద్ది రోజుల పాటు మల్కాజిగిరిలో తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. తర్వాత అక్కడే ఫ్లాట్‌కు మారాడు. తరచూ ముంబయి వెళ్లేవాడు. అక్కడికి వెళ్లినప్పుడు రూ.50 వేలు.. రూ.లక్షతో తిరిగి వచ్చేవాడు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఐదేళ్ల క్రితం అతడిని అరెస్ట్‌ చేశాకే నేరాలు చేస్తున్నాడని కుటుంబ సభ్యులకు తెలిసింది. పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత భార్య, పిల్లలను పట్టించుకోకుండా ముంబయికి వెళ్లాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. ఇంటికి రావడం లేదని పోలీసులు గుర్తించారు.
స్నేహితురాలితో చక్కర్లు.. ముంబయిలో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె కూడా సైబర్‌ నేరగాళ్లకు బ్యాంక్‌ ఖాతాలను సమకూర్చుతోంది. ఇద్దరూ కలిసి ముంబయి శివారులో గదిని అద్దెకు తీసుకుని ఉన్నారని పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకుంటామంటూ మోసగించే నైజీరియన్ల ముఠాతో కూడా నకిలీ ఎస్సై స్నేహితురాలికి పరిచయాలున్నాయని, వారు ఇస్తున్న కమీషన్‌తో ఆమె రూ.లక్షలు సంపాదించుకుందనే వివరాలు సేకరించారు. రూ.1.18 కోట్లు కొట్టేసిన నేరంలో వారికి సంబంధం ఉందన్న ఆధారాలు పోలీసులకు లభించాయి. తమను పోలీసులు వెంటాడుతున్నారన్న అంచనాతోనే వారు ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. నకిలీ ఎస్సై స్నేహితురాలి ఫోన్‌ నంబర్, ఆమె సన్నిహితుల చరవాణులపై నిఘా ఉంచారు.

Total Page Visits: 53 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed