సామాజిక వర్గీకరణ పేరుతో ఉపాధి హామీకి తూట్లు పొడుస్తారా?.. బృందా కరత్‌ ఆగ్రహం

1 min read

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) కింద ఎస్‌సి, ఎస్‌టి, ఇతరులు కేటగిరీ ప్రకారం వేతనాలు చెల్లించడంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ జారీ చేసిన అడ్వైజరీ నోట్‌ ఉద్దేశాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ప్రశ్నించారు. ఆమె కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నరేందర్‌ సింగ్‌ తోమర్‌కు శుక్రవారం అ మేరకు ఒక లేఖ రాశారు. చట్టాన్ని అమలు చేయడంలో ప్రతి కోణంలోనూ సామాజిక వర్గీకరణకు హామీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అడ్వైజరీ నోట్‌ కోరుతోంది.

అయితే, దీనికి గల కారణమేమిటనేది తెలియడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలకైనా చెప్పిందా అంటే అదీ లేదు. నిధులు సకాలంలో విడుదల కావాలంటే నిర్దిష్ట కాలపరిమితిలో అన్ని పక్షాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇది అనేక అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకమనేది సార్వత్రిక కార్యక్రమం, మొత్తంగా చట్టం అమలుకు బడ్జెట్‌ నిబంధనలను రూపొందించారు. అటువంటప్పుడు సామాజిక వర్గీకరణల ద్వారా వివిధ కేటాయింపులు జరిపే విధానాన్ని అకస్మాత్తుగా ముందుకు తేవాల్సిన అవసరమేమొచ్చింది? చట్టానికి కొత్త భాష్యం చెప్పడంలో అర్థమేమైనా ఉందా? డిమాండ్‌ను బట్టి పని ఉండే సార్వత్రిక ఉపాధి హామీ కార్యక్రమంలో పని, కేటాయింపులు అన్నీ దానికి తగ్టట్లే వుంటాయి.

కేటాయింపులను ఇలా సామాజిక తరగతులతో ముడిపెట్టడం వల్ల మొత్తం చట్టం ప్రాతిపదికే దెబ్బతింటుంది. అందువల్ల ఎందుకు ఈ వర్గీకరణ తీసుకొచ్చారో ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం వుందని బృందా కరత్‌ ఆ లేఖలో కోరారు.
దీనిపై బహిరంగంగా ఎలాంటి చర్చ జరపకుండానే అమలుకు పూనుకున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిధుల కేటాయింపులో కీలకమైన ఈ అడ్వైజరీ నోట్‌ను ఇంతవరకు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో కూడా పెట్ట లేదు. పార్లమెంట్‌లో చర్చించలేదు, కనీసం గ్రామీణాభివృద్ధిపై స్థాయీ సంఘంలోను చర్చ జరగలేదు. ఎక్కడా చర్చ జరగకుండానే అమలు చేయడానికి పూనుకోవడం అభ్యంతరకరమని ఆమె అన్నారు.

సార్వత్రిక కార్యక్రమంలో ఎస్‌సి, ఎస్‌టి కమ్యూనిటీలు, మహిళల హక్కుల పరిరక్షణను సిపిఎం ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. ప్రైవేట్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ వంటి ఏకీకృత కార్యక్రమాల్లో ఎస్‌సి,ఎస్‌టి కుటుంబాలకు ప్రాధాన్యమివ్వాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నాము. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా కానీ, వారికి సంబంధించిన వివరాలు, గణాంకాలు ఏవీ ప్రభుత్వం వద్ద లేవు. ‘ఏడాదిలో ఎన్ని ఎస్‌టి కుటుంబాలకు 150 రోజులు పని కల్పించారో వివరాలు వున్నాయా? అటువంటి రికార్డులేవీ ప్రభుత్వం వద్ద లేవు. అటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి బదులు, ఇటువంటి అడ్వైజరీ పంపడంలో ఔచిత్యమేమిటి? దీని వెనుక ఉద్దేశమేమిటో తెలియజేయాలి.

అసలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులే వుండడం లేదన్నది ప్రధాన సమస్యగా వుంది. ఈ ఏడాది ఏప్రిల్‌-మే మాసాల్లో సగటు పని దినాలు కేవలం 20గా వున్నాయి. గతేడాది కన్నా కూడా తక్కువగానే వుంది. కరోనాతో ఉపాధి అవకాశాలు తుడిచిపెట్టుకుపోయిన సమయంలోనే పరిస్థితి ఇలా వుంది. ఇప్పటికైనా కేంద్రం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తగినన్ని పనిదినాలు కల్పించి, ఆకలి రక్కసి నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె ఆ లేఖలో కోరారు..

Total Page Visits: 43 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed