ఢిల్లీ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంతోనే రాజ్యసభ సభ్యత్వానికి అర్హత కోల్పోయారని టీడీపీ ఎంపీలు అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102 ప్రకారం లాభదాయక పదవి చేపడితే రాజ్యసభ సీటుకు అనర్హుడవుతాడని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాపర్టీ కింద ఆయన రాజ్యసభ సభ్యత్వం వదులుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. అనర్హత వేటు పడుతుందని తెలిసి జులై4న రాష్ట్ర ప్రభుత్వం జీవో రద్దు చేసిందని, ప్రభుత్వ చర్య రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. దీనిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని టీడీపీ ఎంపీలు చెప్పారు.
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌(లాభదాయక హోదా) కిందకు రాదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ఆర్డినెన్స్‌ జారీచేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఈ పోస్టులో నియమించారు. అయితే అప్పుడు ఈ పోస్టుకు ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ నుంచి మినహాయింపు లేదు. దీంతో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి ముప్పు రావడంతో ఆ నియామకాన్ని రద్దు చేశారు. చట్టసభల సభ్యులు ఇతర లాభదాయక పోస్టుల్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ అనే నిబంధనలు గతంలో తీసుకొచ్చారు. మంత్రి పదవులు, స్పీకర్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లు-సభ్యులు లాంటి పదవులు శాసనసభ విధుల్లో భాగం కాబట్టి వాటిని లాభదాయకం కింద చూడొద్దని ఒక జాబితా ఖరారు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here