మీ బాధ.. నన్నూ అంతే వేధిస్తోంది!
ప్రజల కొవిడ్ కష్టాలపై ప్రధాని ఆవేదన

1 min read

మీ బాధ.. నన్నూ అంతే వేధిస్తోంది!
ప్రజల కొవిడ్ కష్టాలపై ప్రధాని ఆవేదన

దిల్లీ: కరోనా కల్లోలంతో ప్రజలు పడుతున్న పాట్లు తనను అంతే ఆవేదనకు గురి చేస్తున్నాయని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కనిపించని శత్రువుతో పోరాడుతోందని ఆయన అభివర్ణించారు. వేగంగా మార్పులు చెందే ఈ వైరస్ ప్రపంచానికి సవాలుగా పరిణమించదని ఆందోళన వ్యక్తం చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన సందర్భంగా..ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఈ కరోనా మహమ్మారి కారణంగా మనం ఆత్మీయులను కోల్పోయాం. మీరు అనుభవిస్తోన్న బాధ.. నన్నూ అంతే వేదనకు గురిచేస్తోంది. నేను మీ ప్రధాన సేవకుడిని. మీ ప్రతి ఉద్వేగాన్ని నేను పంచుకుంటాను. మన ముందు కనిపించని శత్రువు ఉంది. 100 ఏళ్లలో ఎన్నడూ లేని కఠిన సమయాన్ని మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఈ మహమ్మారి ప్రపంచాన్ని అడుగడుగునా పరీక్షిస్తోంది’ అని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం కృషి ,చేస్తోందని మోదీ అన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ‘ఇప్పటివరకు దాదాపు 18 కోట్ల మందికి టీకాలు అందించాం. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకాలు అందిస్తున్నాం. మీ వంతు వచ్చినప్పుడు టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వైరస్‌ వల్ల కలిగే తీవ్ర ప్రభావాల నుంచి ఇది రక్షణ తొడుగులా పనిచేస్తుంది. టీకా తీసుకున్న తరవాత కూడా మాస్కులు ధరించడం మానొద్దు. భౌతిక దూరాన్ని మరవద్దు. కరోనాపై జరిపే పోరాటంలో మనం విజయం సాధిస్తాం’ అని ఆయన ప్రజలకు సూచించారు.

‘రెండోదశలో భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. వైరస్ వెలుగుచూసిన దగ్గరి నుంచి అనేక జన్యుమార్పులకు లోనైంది. భారత్‌లో రెండో దశ కల్లోలానికి ఆ మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ నిత్యం లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అత్యధికంగా ఒక్కరోజులో నాలుగువేల మంది మరణిస్తున్నారు. దాంతో పలు రాష్ట్రాలు ఆంక్షలవైపు మొగ్గుచూపాయి. కొన్ని నగరాల్లో పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లే కనిపిస్తున్నా.. తాజాగా గ్రామీణ ప్రాంతాలు కరోనా కాటుకు గురవుతున్నాయి. ఈ సమయంలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషించాలి’ అని ప్రధాని అన్నారు.

Total Page Visits: 22 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed