SGS TV Telugu

24×7 News

త్రిపుర కలెక్టర్‌ సస్పెండ్‌..పెళ్లిలో వీరంగం ఫలితం!

1 min read

అగర్తలా : త్రిపుర (పశ్చిమ) జిల్లా మెజిస్ట్రేట్‌ (కలెక్టర్‌) శైలేష్‌కుమార్‌ యాదవ్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కొవిడ్‌-19 అమలు చేసే ప్రయత్నంలో పెళ్లి వేడుక వద్దకు వచ్చి.. కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధం అని చిందులు వేస్తూ.. పెళ్లిని నిలిపివేయించారు. అలాగే వరుడితో పాటు అక్కడే ఉన్న ఆడా మగ అని చూడకుండా పలువురిపై చేయి చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో త్రిపుర సీఎం బిప్లబ్‌కుమార్‌ దేబ్‌ ఆదేశాల మేరకు ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేయగా.. ఈ వారం ప్రారంభంలో కమిటీ ఎదుట హాజరయ్యారు.
‘శాంతిభద్రలు అమలు చేయడం, కరోనా వ్యాప్తిని నివారించడం నా బాధ్యత. ఆ రోజు రాత్రి నేను చేసినదానికి కట్టుబడి ఉన్నాను’ అని కమిటీకి తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆయనను సస్పెండ్‌ చేయాలని ఎమ్మెల్యేలు ఆషిష్‌ సాహా, సుశాంత చౌదరి సహా పలువురు బీజేపీ నేతలు త్రిపుర ప్రధాన కార్యదర్శి మనోజ్‌కుమార్‌కు లేఖ రాశారు. పశ్చిమ త్రిపుర జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతిమా భౌమిక్ మాట్లాడుతూ వధువు కుటుంబంతో వ్యక్తిగతంగా మాట్లాడుతానని తెలిపారు.
సస్పెన్షన్‌కు దారి తీసిన పరిస్థితులు
త్రిపుర పశ్చిమ జిల్లా మేజిస్ట్రేట్ శైలేష్‌కుమార్‌ యాదవ్‌ వివాహ వేడుకను మధ్యలో నిలిపివేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అగర్తలాలోని త్రిపుర స్వదేశీ ప్రొగ్రెసివ్‌ రీజినల్‌ అలయన్స్‌ చైర్మన్‌ ప్రదయోత్‌ కిశోర్‌ డెబ్బర్మ యాజమాన్యంలో వివాహ వేదిక వద్ద ఘటన చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిపించిన వారందరిపైనా చిర్రుబుర్రులాడుతూ వచ్చారు. స్త్రీ, పురుషులు అన్న తేడా లేకుండా అందరిపైనా చేయి చేసుకుని పెళ్లి వేడుకను ఆపివేయించారు. చివరకు పెళ్లి కుమారుడిపైనా తన ప్రతాపం చూపించారు. అతిథులను వేదిక నుంచి వెళ్లగొట్టాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు.
అలాగే తన కార్యాలయం జారీ చేసిన వివాహ అనుమతి పత్రాన్ని చింపి వేశారు. అయితే ఘటన జరిగిన మరుసటి రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఎవరైనా బాధపడితే క్షమాపణలు కోరుతున్నాను. గతరాత్రి చేసింది ప్రజల ప్రయోజనం, శ్రేయస్సు కోసం మాత్రమే. నాలక్ష్యం ఎవరినీ బాధపెట్టడం, అవమానించడం కాదు’ అని చెప్పుకువచ్చారు. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తే సౌమ్యంగా చెప్పాల్సింది పోయి.. ఓ కలెక్టర్‌ స్థాయి అధికారి ఆడా మగా తేడా లేకుండా చేయి చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేందుకు విధుల నుంచి వైదొలిగేందుకు ఈ మేరకు అనుమతి ఇవ్వాలని డీఎం స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ పంపినట్లు త్రిపుర న్యాయశాఖ మంత్రి రతన్‌లాల్‌ నాథ్‌ తెలిపారు..

Total Page Visits: 216 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *