తొలి వర్షంతోనే ముంబయి మునక

1 min read

వస్తూనే దంచికొట్టిన రుతుపవనాలు

రహదారులు జలమయం

నిలిచిపోయిన సబర్బన్‌ రైలు సర్వీసులు

ముంబయి: నైరుతి రుతు పవనాలు మహారాష్ట్రలో ప్రవేశిస్తూనే తడాఖా చూపించాయి. భారీ వర్షాలు కురవడంతో ముంబయి, నగర శివారులోని పలు ప్రాంతాలు వరద మయమయ్యాయి. రహదారులు నీట మునిగాయి. సబర్బన్‌ రైలు సర్వీసులూ నిలిచిపోయాయి. వాతావరణ శాఖ అంచనా వేసిన విధంగానే మహారాష్ట్రలోకి బుధవారం రుతు పవనాలు ప్రవేశించాయి. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకూ కురిసిన కుండపోత వర్షం నగరాన్ని వరద నీటిలో ముంచెత్తింది. శాంతాక్రజ్‌లో అత్యధికంగా 164.8 మి.మి. వర్షపాతం నమోదైంది. ప్రస్తుత సీజన్‌లో ఇదే తొలి వర్షం. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ముంబయి నగరంతో పాటు ఠాణె, పాల్ఘడ్‌, రాయ్‌గడ్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భారీగా నీరు నిలిచిపోవడంతో ముంబయిలోని మిలాన్‌, ఖర్‌, అంధేరి, మలాద్‌లలోని సబ్‌వేలను ట్రాఫిక్‌ పోలీసులు మూసివేశారు. రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు వాటిని నడపలేక వదిలేసి వెళ్లిపోయారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ నుంచి ఠాణె, నవీ ముంబయిలోని వాశి మధ్యనున్న రైలు మార్గాలపైకి వరద నీరు చేరుకొంది. కొవిడ్‌ కారణంగా సాధారణ ప్రయాణికులకు అనుమతి లేకపోవడంతో వైద్య విభాగాలు, అత్యవసర సేవల ఉద్యోగుల కోసం లోకల్‌ రైళ్లను నడుపుతున్నారు. భారీ వర్షాల కారణంగా బుధవారం వాటిని కూడా అధికారులు నిలిపివేశారు. రుతు పవనాల కారణంగా మరో రెండు మూడు రోజులు మహారాష్ట్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Total Page Visits: 16 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed