ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు

1 min read

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కాదని, పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. అయితే కేసు దర్యాప్తుకు రఘురామకృష్ణరాజు సహకరించాలని పేర్కొంది. పిటిషనర్‌ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదని తెలిపింది. కేసు విచారణకు అవసరమైతే కనీసం ఒక రోజు ముందు పిటిషనర్‌కు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరవ్వొచ్చని తెలిపింది. రఘురామ, మరో ఇద్దరు వ్యక్తులు రూ.లక్ష పూచీకత్తును పది రోజుల్లో ట్రయల్‌ కోర్టులో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపులా పోటాపోటీగా వాదనలు సాగాయి. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దవే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అంతకుముందు ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం సమర్పించిన నివేదికను సుప్రీం పరిశీలించింది. ‘‘ఆర్మీ ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదు. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో గాయాలకు గల కారణాలు లేవు. గుజరాత్‌ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలి. హైకోర్టులో ఇంకా మెరిట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో ఎలా పిటిషన్‌ దాఖలు చేస్తారు?’’ అంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే సుప్రీంకు తెలిపారు. రఘురామ రెండు వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడారని అన్నారు.

దవే ఏమన్నారు?

ఎంపీ రఘురామ హద్దులు మీరారని, కరోనా సంక్షోభ సమయంలో ఇదంతా సరికాదని ఆయనకు సమయమిచ్చామని దవే కోర్టుకు తెలిపారు. సీఐడీ అధికారులు ఎంపీకి సంబంధించిన 45 వీడియోలు సేకరించి విచారణ చేపట్టారన్నారు. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి సృష్టించేందుకు రఘురామ ప్రయత్నించారనీ, ఇవన్నీ రాజద్రోహం కిందికే వస్తాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామకృష్ణరాజు ఎంపీ అని ముకుల్‌ రోహత్గీ పదేపదే చెబుతున్నారనీ, చట్టం అందరికీ ఒక్కటేనని దవే అన్నారు. ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్‌ ఇచ్చినట్లు కాదన్నారు. హైకోర్టు బెయిల్‌ కోసం కింది కోర్టుకు వెళ్లమని చెప్పిందని, ఎంపీ అయినంత మాత్రాన బైపాస్‌లో నేరుగా సుప్రీం కోర్టుకు ఎలా వస్తారు? అని దవే ప్రశ్నించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికపై తాము అభ్యంతరం చెప్పడం లేదని, అదే సమయంలో జీజీహెచ్‌ ఆస్పత్రి నివేదిక కూడా సరైనదేనని కోర్టుకు తెలిపారు. అలాగైతే ఎంపీ కాలికి ఫ్రాక్చర్‌ గురించి ఏం చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. గుంటూరు జైలు నుంచి ఆర్మీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తామంటే ఎంపీ నిరాకరించారనీ, తన కారులో వెళ్తూ అభివాదం చేశారనీ, ఆ సమయంలో కాలిగాయాలు చూపించారనీ చెప్పారు.

రోహత్గీ ఏమని వాదించారు?

రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాది రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. జగన్‌ బెయిల్‌ రద్దుకు పిటిషన్‌ వేశారన్న నెపంతోనే ఆయనపై కక్షపెంచుకున్నారని కోర్టుకు తెలిపారు. జగన్‌ ప్రతివాదిగా లేనందున దీనిలోకి ఆయన్ను లాగొద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే అన్నారు. పిటిషనర్‌గా తాను చెప్పాలనుకున్నది తాను చెబుతానని రోహత్గీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు న్యాయవాదులు ఎందుకు తగవులాడుకుంటున్నారని ధర్మాసనం మందలించింది. బెయిల్‌ రాకుండా ఉండటం కోసమే రాజద్రోహం కేసు పెట్టారని రోహత్గీ ఆక్షేపించారు. అరెస్టు, మెజిస్ట్రేట్‌, హైకోర్టు విచారణ పరిణామాలను రోహత్గీ కోర్టుకు వివరించారు. అనంతరం ఆర్మీ ఆస్పత్రి వైద్య పరీక్షలను ఆయన ప్రస్తావించారు. కాలి బొటనవేలు పక్కన ప్రాక్చర్‌ అయ్యిందని వైద్యులు తెలిపారన్నారు. సీఐడీ అదుపులో ఉండగా ఎంపీని చిత్రహింసలు పెట్టిన విషయం నిజమేనని వైద్యనివేదికతో నిర్ధారణ అయ్యిందన్నారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరారు. సిట్టింగ్‌ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ముకుల్‌ రోహత్గీ ప్రశ్నించారు. కేదార్‌నాథ్‌ తీర్పులో రాజద్రోహం పెట్టే కారణాలు వివరించారు. కానీ, ఈ సందర్భంలో రాజద్రోహం పెట్టిన కారణం పూర్తిగా బోగస్‌ అని రోహత్గీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Total Page Visits: 17 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed