సూర్యాస్తమయ వేళకే ఆలయం మూసేస్తారు!

1 min read

నిత్యకల్యాణంతో కళకళలాడుతూ… తిరుమల గిరిగా పిలిచే ఈ క్షేత్రంలోని గర్భగుడికి తలుపులు ఉండవు. భరద్వాజ గోత్రీకులు మాత్రమే అర్చకులుగా వ్యవహరించే ఈ ఆలయంలో శ్రీనివాసుడు పుట్ట రూపంలో వెలిశాడని చెబుతారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఉన్న ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
సాధారణంగా ఏ ఆలయాన్నయినా సూర్యోదయానికి ముందే తెరిచి రాత్రికి మూసేస్తారు. కానీ తిరుమలగిరిని మాత్రం సూర్యోదయ సమయానికి తెరిచి సూర్యాస్తమయానికి మూసేస్తారు. ఆ తరువాత అర్చకులతోపాటూ భక్తులెవరూ ఆ కొండపైన ఉండరు. గర్భాలయానికి ఎలాంటి తలుపులు లేకపోయినా ఆదిశేషువు స్వామికి రక్షణగా ఉంటాడని అంటారు. కొన్నివందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామిపుట్టరూపంలో స్వయంభువుగా వెలిశాడనడానికీ భరద్వాజ గోత్రీకులే అర్చకులుగా ఉండటానికీ ఓ కథ ప్రచారంలో ఉంది.

స్థలపురాణం


ఒకప్పుడు గుంటూరు, కృష్ణా, నల్గొండ జిల్లాల సంగమ ప్రదేశం వద్ద ఉన్న కృష్ణా తీర ప్రాంతాన్ని నందుల రేవు అని పిలిచేవారట. ఇక్కడ నందుల శిలా విగ్రహాలు కూడా ఉండేవట. ఒకానొకప్పుడు భరద్వాజ మహర్షి ఈ నందుల రేవు దగ్గరకు వచ్చి నందుల్ని దర్శించుకుని దగ్గర్లోనే ఓఆశ్రమాన్ని నిర్మించుకున్నాడట. ఇక్కడున్న కొండపైన స్వామి కొలువుదీరితే ప్రతి ఒక్కరికీ శ్రీనివాసుడి దర్శనభాగ్యం లభిస్తుందనే ఉద్దేశంతో తపస్సు చేయడం ప్రారంభించాడట. మహర్షి భక్తికి మెచ్చిన స్వామి చివరకు ఈ గిరిపైన పుట్టరూపంలో వెలిశాడట. అప్పటినుంచీ స్వామిని తిరుమలగిరి వేంకటేశ్వరుడిగా భక్తులు ఆరాధించడం మొదలుపెట్టారు. అలాగే భరద్వాజ మహర్షి వల్లే స్వామి ఇక్కడ అవతరించాడు కాబట్టి ఈ ఆలయంలో భరద్వాజ గోత్రీకులే పూజలు చేయాలనే సంప్రదాయం మొదలైందని అంటారు.

ప్రత్యేక పూజలు


భరద్వాజ మహర్షి గర్భగుడిలో స్వామి విగ్రహంతోపాటూ చుట్టూ తొమ్మిది ఆంజనేయ స్వామి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించినా ప్రస్తుతం అయిదు మాత్రమే కనిపిస్తాయి. ప్రతిరోజూ కల్యాణం నిర్వహించే ఈ ఆలయంలో ఏటా చైత్రమాసంలో పౌర్ణమి నుంచి అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలను జరిపిస్తారు. రోజంతా చేసే పూజల మాట ఎలా ఉన్నా సాయంత్రం 5.30 గంటలకు పవళింపు సేవ చేసి ఆలయాన్ని మూసేస్తారు. ఈ గుడికి క్షేత్రపాలకుడు శివుడు కాబట్టి కొండపైన మల్లేశ్వరస్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నాక భ్రమరాంబ సహిత మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్లినప్పుడే తిరుమలగిరి యాత్ర పూర్తవుతుందని చెబుతారు. ప్రతిరోజూ వచ్చే భక్తులు ఒకెత్తయితే… ఫాల్గుణ మాసంలో పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు తాము పండించిన పంటలో కొంత భాగాన్ని తీసుకువచ్చి స్వామికి ముడుపు కింద సమర్పించడం మరొకెత్తు. వాటన్నింటినీ ఆలయ అధికారులు వేలం వేసి ఆ ఆదాయాన్ని ఆలయ నిర్వహణకు ఉపయోగిస్తారు. సంతానం లేని మహిళలు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న బిల్వ వృక్షం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి తమ చీర చెంగు చింపి చెట్టుకు కడితే పిల్లలు పుడతారని అంటారు. పెళ్లికానివారు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకుని కల్యాణం చూస్తే త్వరగా పెళ్లవుతుందనేది భక్తుల నమ్మకం. అదేవిధంగా కొందరు భక్తులు మండలంపాటు స్వామి దీక్షను తీసుకుని ఇరుముడి కూడా సమర్పిస్తుంటారు. నిత్యకల్యాణంతోపాటూ ఏడాది మొత్తం స్వామికి ఆవు పాలు, పెరుగు, తేనె, గంధం, పన్నీరుతో అభిషేకం చేసే కార్యక్రమాన్ని చూసేందుకు రెండుకళ్లూ చాలవంటారు. ఇక్కడున్న పుష్కరిణి స్వామి పాదం ఆకృతిలో ఉంటుంది. స్వామి మొదటిసారి ఈ కొండపైన పాదం మోపినప్పుడు అది కుంగిపోయి నీరు పైకి రావడం వల్లే అలా కనిపిస్తుందని అంటారు.

ఎలా చేరుకోవచ్చు


ఈ క్షేత్రం విజయవాడ – హైదరాబాద్‌ రహదారి పక్కనున్న చిల్లకల్లు నుంచి 3 కి.మీ. దూరంలో ఉంది. విజయవాడ నుంచి 79 కి.మీ., హైదరాబాద్‌ నుంచి 200 కి.మీ. దూరంలో ఉంది. విజయవాడ వరకు రైలులో వచ్చి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

Total Page Visits: 186 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed