శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం

1 min read

శ్రీ కూర్మం

సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఈ ఆలయంలో కూర్మావతారం రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

భారత దేశంలో ఉన్న ఆలయాల్లో ఇదొక్కటే ఉంది. ఈ ఆలయంలో శిల్పకళా ఎంతో విశిష్టతను సంతరించకుంది.
ఆ ఆలయంలో ఇంకో విశేషం కూడా ఉంది. అక్కడి స్వామి పడమటి ముఖంగా దర్శనమిస్తారు, అంతే కాక ఈ ఆలయంలో మరో విషేషం ఉంది. అదేంటంటే ప్రతి ఆలయంలో ఒక ధ్వజస్తంభం మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.

11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ ఈ ఆయల ప్రాంగనంలో లభించాయి.

శ్రీకాకుళం, గార మండలంలో ఉన్నఈ ఆలయం 2 వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలా మంది అనుకుంటుంటారు. నిజానికి ఆలయం ఎప్పుడ నిర్మించారనే విషయం స్పష్టంగా తెలియదు. కానీ ఈ ఆలయాన్ని చోళ, కళింగ రాజా రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారు. 7 వ శతాబ్దం నుంచి ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసని చెపుతుంటారు. తరువాత ఈ ప్రాంతాన్నిపాలించిన వివిధ రాజవంశాలు వివిధ దశలలో అభివృద్ధి చేశారు. ఎక్కువగా కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశం పాలనలో చేశారు. దేవాలయ మొత్తం నిర్మాణంలో గాంధర్వ శిల్ప సంపాద అని పిలవబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు మరియు కీర్తిని చాటి చెప్తాయి.

స్థలుపురాణం:-

దక్షిణ సముద్ర తీరాన శ్వేతపురమనే పట్టణం శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది.

శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వేపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతము మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను.

అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను. రాజు వంశధారలో స్నానమాచరించి, అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరుని మరియు సోమేశ్వరుని పూజించి, ఘోర తపస్సు చేసినా, మహానిష్ణువు కరుణించలేదు.

అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీమహావిష్ణువు, కూర్మావతారంలో చక్రతీర్థగుండము నుండి వెలువడి, శ్వేతమహారాజుకు దర్శనమిచ్చెను.

స్వామి నాలుగు చేతులతో, శంఖము, చక్రము, గద మరియు పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండుమని ప్రార్ధింపగా శ్రీమహావిష్ణువు కొలువై ఉండేందుకు తనకు తగిన మంచి స్థానమునకై రాజు మరియు నారదునితో కలసి ఒక వటవృక్షము వద్దకు వచ్చి, ఆవృక్షముపై చక్ర ప్రయోగము చేసెను. అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవించెను. ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేత గుండము అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండి శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై, స్వామివారి వామభాగములో వసించెను. అంత శ్రీకూర్మనాధుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్యనివాసమేర్పరుచుకొనెను.

ఈ శ్రీకూర్మక్షేత్రము పంచలింగారాధ్యక్షేత్రము (ఐదుగురు శివులు క్షేత్రపాలకులుగా ఉన్న క్షేత్రము) తూర్పున వంశధారాసాగర సంగమ ప్రదేశములో కళింగ పట్టణములో 1.#కర్పూరేశ్వరుడు, ఉత్తరమున సింధూర పర్వతమున (సింగుపురపుకొండ) 2.#హటకేశ్వరుడు, పశ్చిమమున నాగావళీ తీరమున శ్రీకాకుళ పట్టణములో 3.#కోటీశ్వరుడు, ఉత్తరమున (పిప్పల) ఇప్పిలి గ్రామమున 4.#సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్రమున సుధాకుండతీరమున 5..#సిద్ధేశ్వరుడు వేంచేసి ఉన్నారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారమున భైరవుడు, మరియు ఆలయ ప్రాకారమున అష్టదిక్పాలురును క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తున్నారు.

ఆలయ విశిష్టత

ఈ ఆలయానికి పెద్ద ప్రాకారం దాని వెలుపల ‘శ్వేత పుష్కరిణి’ ఉంది. క్రీస్తు శకం నాలుగో శతాబ్ది నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆలయంలోని ప్రతీ శిల్పం ఒక అపూరూప కళాఖండంగా చెప్పవచ్చు. ఎంతో మంది రాజులు వేసిన శిలాశాసనాలు శిథిలమై పోకుండా ఇప్పటికీ లభిస్తాయి. ఇవి కళింగాంధ్ర చరిత్రకు అమూల్యా ధారాలుగా నిలుస్తాయి. అత్యద్భుతమైన వాస్తు కళతో ఆలయం అలరారుతూ ఉంటుంది. ఈ ఆలయ మండపంలోని 108 రాతి స్తంభాలు అన్నీ ఏకశిలతో రూపు దిద్దుకున్నవే. ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమణీయంగా మలిచారు.

ప్రతీ ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్‌ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భ గుడిలో ఎడమవైపు గోడ మూలగా శ్రీకూర్మనాధుని ఆవతారంలో శ్రీమహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరి స్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు, ఐదడు గుల పొడవు, నాలుగడుగులు వెడల్పు కొలతలు గల రాతిపీఠం పై కూర్మనాథస్వామి దర్శనమిస్తారు. రెండున్నర అడుగుల పొడవు, అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరం చివరిగా పశ్చిమా భిముఖంగా తోకతో మూడు భాగాలుగా శ్రీకూర్మం కన్పిస్తుంది. మధ్య తక్కు వ ఎత్తులో శిరస్సుకలిపి ఒకటిగా కన్పిస్తా యి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహమంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరి స్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు.

బలరాముని శాపం

ఆలయంలో శ్రీకూర్మనాథుని విగ్రహం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్రకోటేశ్వర లింగ ప్రతిష్ఠ చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చారు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతనిని అడ్డగిం చాడు. దాంతో అతడు భైరవుని పై ఆగ్రహంతో ఆతనిని గిరగిరా తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాధ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఆయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాగ్ని చల్లారని బలరాముడు ‘కూర్మావతారం’లో ఆలయం భూమి పై మరెక్కడా ఉండకూడదని శపించాడు.

అందువల్లే ప్రపంచంలోనే ఇది ఏకైక #కూర్మనాధస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది.

ఈఆలయా నికి రెండు ధ్వజ స్తంభాలు ఉండడం మరో ప్రత్యేకత. శ్రీకూర్మంలోని పుష్కరిణి అడుగుభాగం నీరుతో కలిసిన మట్టి తెల్లగా తళతళలాడుతూ ఉండడం విశేషం. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణీలో జలక్రీడలాడుతూ కన్పించాడట. అందు వల్లే ఆ పుష్క రిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని ‘గోపీ చందనం’ అని కూడా అంటారు.

శ్రీకాకుళం పట్టణం పాత బస్ స్టాండు నుండి ప్రతి 15 నిమిషాలకు అరసవిల్లి మీదుగా ఆర్టిసీ బస్సులు ఉన్నాయి.

ఉదయం 6.00గంటలనుండి, రాత్రి 8.00గంటల వరకు నడుస్తాయి. అంతేకాక ఆటోలు, టాక్సిలు ఉన్నాయి.
సేకరణ… ఆదూరి భానూ ప్రకాష్

Total Page Visits: 186 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed