వైద్య ఖర్చులు భరించలేకపోతున్నాం..ఆదుకోండి

1 min read

వైద్య ఖర్చులు భరించలేకపోతున్నాం..ఆదుకోండి

_”రాజన్న రచ్చబండ”లో ఎంపి భరత్ రామ్ కు పలువురు వినతి

రాజమహేంద్రవరం, మే 28:

ఆర్ధిక భారం కారణంగా తాము వైద్యం, అవసరమైన మందులు కొనుగోలు చేసుకోలేకపోతున్నామని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలంటూ వివిధ వ్యాధులతో బాధ పడుతున్న పలువురు రాజమహేంద్రవరం ఎంపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్విప్ మార్గాని భరత్ రామ్ కు విన్నవించుకున్నారు.

శుక్రవారం నగరంలోని మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపి కార్యాలయంలో ఎంపి భరత్ రామ్ నిర్వహించిన రాజన్న రచ్చబండలో ఈ మేరకు పలువురు అర్జీలు సమర్పించుకున్నారు.

లివర్ ట్రాన్స్ ప్లంటేషన్, గుండెకు సంబంధించి సమస్యలు ఇలా ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు తమతమ వైద్య నివేదికలతో ఎంపి భరత్ రామ్ వద్దకు వచ్చారు.

ప్రధానంగా అత్యంత అరుదుగా వచ్చే లింపోడిమా వ్యాధితో బాధపడుతున్న రెండేళ్ళ చిన్నారితో ఆమె తల్లిదండ్రులు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు.

తమ ముద్దుల పాపాయికి వచ్చిన ఈ వ్యాధికి వైద్యం నిమిత్తం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వైద్యులకు చూపించిన ఫలితం లేకపోయిందని వారు వాపోయారు.

చివరకు చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేస్తారని తెలిసిందని అయితే తమకు అంత ఆర్ధిక స్తోమత లేదని, మీరే కాపాడాలంటూ ఎంపి భరత్ రామ్ ను వేడుకున్నారు.

దీనిపై వెంటనే స్పందించిన ఎంపి భరత్ రామ్ నగరంలోని ఓ వైద్యునితో చిన్నారి వ్యాధిని గూర్చి మాట్లాడారు.

అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ చిన్నారి వైద్య సహాయానికి ఏమైనా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందా అని సీఎంఆర్ఎఫ్ అధికారులకు ఫోన్ చేసి తెలుసుకున్నారు.

ప్లాస్టిక్ సర్జన్లతో కూడా మాట్లాడి తగిన విధంగా సహకరిస్తానని ఎంపి భరత్ రామ్ ఆ చిన్నారి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు.

పంచాయితీల వారీగా అనాథ పిల్లల వివరాలు సేకరించండి

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల వివరాలను పంచాయితీల వారీగా సేకరించమని సూపర్ సిక్ట్సీ టీం భరత్ కు ఎంపి సూచించారు.

ఈ బృందంలో ప్రత్యేకించి అనాథ పిల్లలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ఉల్లూరి రాజు, పీతా రామకృష్ణ బృందంతో ఎంపి భరత్ రామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లలకు అందించే ఆర్ధిక సహాయం తప్పనిసరిగా అర్హులైన వారందరికీ అందేలా చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకుని వదిలేశాడు..!!

ప్రేమించి పెళ్లి చేసుకుని అవసరం తీరిపోయాక తన భర్త వదిలేశాడని, చట్ట పరంగా న్యాయం చేయాలని ఓ బాధితురాలు ఎంపి భరత్ రామ్ కు విన్నవించుకుంది.

ఈ విషయమై రాజానగరం సీఐకు ఎంపి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు.

సీఐను కలవవలసిందిగా సదరు వివాహితకు ఎంపి భరత్ రామ్ చెప్పారు.
………

Total Page Visits: 16 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed