పార్టీలకు అతీతంగా క్షత్రియులు ఐక్యం కావాలి

1 min read

  • ఎఫ్.సి.ఐ సభ్యులు సతీష్ రాజు
    కాకినాడ, మే 18: నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజుపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తుందని భారత ఆహార సంస్థ సభ్యులు, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన వెంకట సత్యనారాయణ రాజు (సతీష్ రాజు) విమర్శించారు. కాకినాడలో మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలలో అభిప్రాయ బేధాలు తలెత్తినపుడు విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, అంత మాత్రానికే రాజద్రోహం, దేశ ద్రోహం అంటూ కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజు అరెస్టుపై వైసీపీకి చెందిన క్షత్రియ నాయకులు కొందరు అత్యుత్సాహంతో చేస్తున్న ప్రకటనలు క్షత్రియ ఐక్యతకు భంగం కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలలో టిక్కెట్లు ఇచ్చేటపుడు రాజకీయ పార్టీలు గెలుపును ప్రామాణికంగా తీసుకుంటాయని, అంత మాత్రానికే వైసీపీ అధినేత జగన్ క్షత్రియ సామాజిక వర్గానికి మేలు చేసినట్లు కాదని సతీష్ రాజు స్పష్టం చేశారు. సత్యం కంప్యూటర్స్ సంస్థ నెలకొల్పి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన బైర్రాజు రామలింగరాజు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ద్వారా క్షత్రియ సామాజిక వర్గ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ఆయన గుర్తు చేశారు. అటువంటి రామలింగరాజు పతనానికి కారకులెవరో క్షత్రియ సమాజానికే కాదు.. తెలుగు వారందరికీ తెలుసునని సతీష్ రాజు చెప్పారు. పూసపాటి వంశీకులు రాష్ట్రంలో విద్యా, ఆధ్యాత్మిక రంగాలకు ఎనలేని సేవలు చేశారని, మాన్సాస్ సంస్థ సేవలు కూడా అందరికీ తెలుసునని తెలిపారు. అటువంటి మాన్సాస్ సంస్థ అంతర్గత వ్యవహారాలలో తలదూర్చి జగన్ ప్రభుత్వం అశోక్ గజపతిరాజు పట్ల వ్యవహరించిన తీరు మర్చిపోలేమని సతీష్ రాజు చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పట్ల అవమానకరంగా వ్యవహరిస్తే ఖండించ లేని కొందరు పెద్ద మనుషులు ఇప్పుడు రఘురామకృష్ణంరాజు విషయంలో ప్రభుత్వానికి తొత్తులుగా చేస్తున్న ప్రకటనలు సిగ్గు చేటు అని సతీష్ రాజు వ్యాఖ్యానించారు. క్షత్రియులు పార్టీలకు అతీతంగా ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. విభిన్న పార్టీలలో ఉన్న వ్యక్తుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండడం సహజమని, అంత మాత్రాన క్షత్రియ సామాజిక వర్గం గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించడం సబబు కాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి, ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మధ్య నడుస్తున్నది రాజకీయ పోరాటమే కానీ కుల పోరాటం కాదని ఆయన చెప్పారు. రఘురామకృష్ణంరాజు అరెస్టు, సిబిఐ కస్టడీలో ఆయనను చిత్రహింసలకు గురి చేయడం వంటి పరిణామాలు మాత్రం సమర్ధనీయం కాదని సతీష్ రాజు చెప్పారు.
Total Page Visits: 43 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed