SGS TV Telugu

24×7 News

పాత్రికేయుల కోసం ప్ర‌త్యేక విభాగం…

1 min read

  • వైద్య సేవల అనుసంధానానికి నోడల్ ఆఫీసర్లు నియామ‌కం
  • క‌రోనా నేప‌ధ్యంలో ప్ర‌భుత్వం నిర్ణ‌యం
  • సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి
    విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కరోనా ఉధృతి నేపధ్యంలో దాని బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత్రికేయులకు వైద్య సేవలు అందించటంలో జిల్లా వైద్య యంత్రాంగానికి, పాత్రికేయులకు మధ్య అనుసంధానకర్తలుగా పనిచేసేందుకు సమాచార శాఖ త‌ర‌ఫున రాష్ట్ర స్థాయిలో ఒక సీనియర్ అధికారిని, జిల్లా స్థాయిలో శాఖాధిపతులను నోడల్ అధికారులుగా నియమించినట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నోడల్ అధికారులు సంబంధిత జిల్లాలలో గుర్తించిన ఆసుపత్రిలో పాత్రికేయులకు వైద్య పరీక్షల నిర్వహణ నుంచి వైద్యం అందించటం, కోవిడ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకునే వరకు సహాయకారిగా ఉంటూ అన్ని అవసరమైన వైద్య చర్యలను తీసుకోవాల్సిందిగా వారిని ఆదేశించారు. పాత్రికేయులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారిగా సమాచార, పౌరసంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు పోతుల కిరణ్‌కుమార్ (మొబైల్ నెం: 9121215223)ను నియమించామని, అదేవిధంగా ప్రతి జిల్లాలో సమాచార శాఖ (ఉపసంచాలకులు/సహాయ సంచాలకులు), సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను పాత్రికేయులకు అందుబాటులో ఉంచి ఎల్లవేళలా వారికి సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాత్రికేయులు విధినిర్వహణలో భాగంగా అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి రావటం అలాంటి సందర్భంలో మాస్క్, శానిటైజర్‌లు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాత్రికేయుల విధినిర్వహణను దృష్టిలో ఉంచుకొని వారికి వ్యాధి నిరోధక టీకా (వ్యాక్సిన్)ను వేయించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి చర్యలను తీసుకోవాల్సిందిగా నోడల్ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కోవిడ్-19 బారినపడిన పాత్రికేయులకు ప్రత్యేకంగా ఆసుపత్రులలో బెడ్లు కేటాయించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఒక పక్క వైద్యులు కరోనా నియంత్రణకు ముందు వరుసలో నిలబడి వైద్యం అందిస్తున్నారని వారికి మీడియా కూడా సహకారం అందించాలన్నారు. కోవిడ్ బారిన పడి చనిపోయిన పాత్రికేయులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారం మరియు అన్ని వివరాలతో కూడిన డాక్యుమెంట్లను జిల్లాలోని సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులకు అందజేయాల్సిందిగా కమిషనర్ విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు..
Total Page Visits: 20 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *