SGS TV Telugu

24×7 News

దేశంలో ఆగని వైరస్‌ విలయం

1 min read


ఒక్కరోజులో 3,293 మంది మృతి!
2 లక్షల మరణాలు దాటిన నాలుగో దేశం భారత్‌
రికార్డు స్థాయిలో 3.6 లక్షల కొత్త కేసులు
గోవాలో మూడు రోజులు లాక్‌డౌన్‌
దేశంలోని 150 జిల్లాల్లో లాక్‌డౌన్‌?
కేంద్రానికి ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: దేశాన్ని కరోనా వైరస్‌ ఉప్పెనలా కమ్మేస్తోంది. మంగళవారం ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 3,293 మందిని బలితీసుకుంది. కరోనా మొదలైనప్పటి నుంచి దేశంలో మూడు వేలు పైబడి మరణాలు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఏప్రిల్‌ 20న తొలిసారి 2 వేల మార్కును దాటిన మరణాలు.. మరో ఏడు రోజుల్లోనే 3 వేల మార్కును దాటేశాయి. దీంతో.. మొత్తం మరణాల సంఖ్య 2,01,187కి పెరిగింది. అమెరికా, బ్రెజిల్‌, మెక్సికో తర్వాత ప్రపంచంలో 2 లక్షలకు పైబడి మరణాలు సంభవించిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది. ఇక.. రోజువారీ కేసుల్లోనూ రికార్డులు కొనసాగుతున్నాయి. ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 3,60,960 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో.. మొత్తం బాధితుల సంఖ్య 1,79,97,267కి పెరగ్గా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 30 లక్షలకు (29,78,709) చేరువవుతోంది. ఇది మొత్తం కేసుల్లో 16.34 శాతంగా ఉంది. దేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుండడం.. కాస్తంత ఊరటనిస్తోంది.

మంగళవారం ఒక్కరోజులో 2.61 లక్షల మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 82.54 శాతానికి తగ్గింది. కాగా, దేశంలో కొవిడ్‌ వ్యాప్తిని 10 రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మహారాష్ట్ర (66,358) అత్యధిక కేసులతో దూసుకుపోతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇక్కడ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. దీంతో.. మరో 15 రోజుల పాటు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ఆరోగ్య మంత్రి రాజేశ్‌ తోపే ప్రకటించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్‌, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, చత్తీ్‌సగఢ్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌ నిలిచాయి. ఈ పది రాష్ట్రాల్లోనే మొత్తం 73.59 శాతం కేసులు నమోదయ్యాయి. అలాగే, మరణాల్లోనూ 78.53 శాతం 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అందులో మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 895 మంది మృత్యువాత పడగా.. ఢిల్లీ (381)లోనూ భారీస్థాయిలో మరణాలు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ (264), చత్తీ్‌సగఢ్‌ (246), కర్ణాటక (229), గుజరాత్‌ (170), జార్ఖండ్‌ (131), రాజస్థాన్‌ (121), పంజాబ్‌ (100) రాష్ట్రాల్లో వందకు పైగా మరణాలు సంభవించగా.. తమిళనాడులో 98 మంది మృతి చెందారు. ఇక, యాక్టివ్‌ కేసుల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా.. మొత్తం పది రాష్ట్రాల్లోనే 71.91 శాతం కొవిడ్‌ కేసులు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో కొవిడ్‌ ఉగ్రరూపం దాల్చింది. ఇక్కడ ఒక్కరోజులో 39 వేల మంది వైరస్‌ బారినపడగా.. ఒక్క బెంగళూరు నగరంలోనే 22,596 కేసులు వెలుగుచూశాయి. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఒక రాష్ట్రంలో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. కాగా, మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ గౌక్వాడ్‌ (81) కొవిడ్‌తో బుధవారం మృతి చెందారు.

150 జిల్లాల్లో లాక్‌డౌన్‌?

దేశంలో పాజిటివిటీ రేటు 15 శాతం పైబడ్డ 150 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. ఆయా జిల్లాల్లో అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపునిస్తూ.. కఠిన ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి సూచించింది. కరోనా వ్యాప్తిపై ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇది ప్రతిపాదన మాత్రమేనని, రాష్ట్రాలను సంప్రదించిన తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇలా చేయడం వల్ల వైరస్‌ వ్యాప్తి గొలుసు తెగుతుందని, తద్వారా కేసులు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

గోవాలో 3 రోజులు లాక్‌డౌన్‌

కరోనా అదుపుతప్పుతున్న వేళ.. తాజాగా మరో రాష్ట్రం లాక్‌డౌన్‌ ప్రకటించింది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. గోవాలో మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ప్రకటించారు. ఈ నెల 29 రాత్రి 7 గంటల నుంచి మే 3 ఉదయం వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. ఆ సమయంలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని, పబ్బులు, క్యాసినోలు, ప్రజా రవాణా, హోటళ్లను మూసివేస్తామని చెప్పారు. దినసరి కూలీలు భయపడాల్సిన అవసరం లేదని, మూడో రోజుల తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ఆయన వివరించారు. గోవాలో మంగళవారం 2,110 కేసులు నమోదవగా.. 31 మంది మరణించారు.

Total Page Visits: 10 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *