ధాన్యం బకాయిల కోసం ఎపి రైతు సంఘం, కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులకు తక్షణమే ధాన్యం బకాయిలు చెల్లించకపోతే ఖరీఫ్‌ సాగు కష్టమని స్పష్టం చేశారు. ట్రాక్టర్ల యజమానులకు గత పంట దుక్కుల బకాయిలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం దుక్కులు చేయడం లేదన్నారు. రబీ పంట అమ్మి 50 రోజులు దాటుతున్నా ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు. నిబంధనల ప్రకారం రైతు ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతుల ఖాతాకు డబ్బు జమ చేయాల్సి ఉందన్నారు. నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తుందని దుయ్యబట్టారు. జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకు రూ.250 కోట్లు వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. పెంటపాడులో 750 మంది రైతులకు రూ.14 కోట్లు వరకు ధాన్యం బకాయిలు ఇవ్వాల్సి ఉందన్నారు. ధాన్యం బకాయి సొమ్ము రైతులకు వడ్డీతో సహా కలిపి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలకు సిపిఎం, సిపిఐ, సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here