SGS TV Telugu

24×7 News

నిరతాన్నదాత్రి శ్రీమతిడొక్కాసీతమ్మగారి

1 min read

నిరతాన్నదాత్రి #శ్రీమతిడొక్కాసీతమ్మగారి

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • రచన డొక్కా ఫణి
    ఆకలి మనిషిచేత ఏమైనా చేయిస్తుంది. ఆకలి బాధని తీర్చుకోవడానికి మనిషి ఎన్నో చెయ్యరాని కార్యాలు చెయ్యడానికి కూడా వెనుకాడడు. ప్రాణి బతకడానికి ఆహారం కావాలి. కడుపునిండిన వాడి మనసులో చెడ్డ ఆలోచనలు రావు. తన పొట్ట నిండిన నాడు మనిషి పక్కవాడి మేలు గురించి ఆలోచిస్తాడు. అలా నలుగురూ ఆలోచిస్తే , సమాజం బాగుపడుతుంది. అందువలన అన్నదానాన్ని మించిన దానమేలేదు. మరే దానం చేసినా , గ్రహీత ఇంకా ఇంకా కావాలని ఆశించే అవకాశం వుంది. మనం కోట్లు కుమ్మరించినా , దానాన్ని స్వీకరించేవారు మరిన్ని కోట్లు రావాలని ఆశించవచ్చు. అలాగే గోదానమూ , భూదానమూ , కనక వస్తు వాహనాల దానమూను. అయితే , ఒక్క అన్నదానంలో మాత్రమే దానం స్వీకరించిన వారు సంపూర్ణంగా , ఏ లోటూ లేకుండా తృప్తి చెందుతారు. మృష్టాన్న భోజనము చేయడం వలన శరీరములోని సకల అవయవములకు , మనసుకు , ఆత్మకూ ఏకకాలం లో తృప్తి కలుగుతుంది. అలా భోజనం చేసినవారు , ఆ అన్నదాతను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. వారి వంశం కలకాలం చల్లగా వుండాలని దీవెనలందిస్తారు.

మహాభారతంలో అశ్వమేధ పర్వం లో , అన్నదాన మహిమకు సంబంధించిన ఒక కథ వుంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు అశ్వమేధం చేస్తాడు. ఆసమయంలో అతిథులందరికీ కావలసినవన్నీ ఇచ్చి , సమస్తమూ దానం చేస్తాడు. అందరూ అతని దాన గుణాన్ని వేనోళ్ళ కొనియాడతారు. అప్పుడు అక్కడికి ఒక ముంగిస వస్తుంది. దాని శరీరం సగం బంగారు వర్ణంలో వుంటుంది. *”ధర్మ రాజా , నీకు నిజమైన అన్నదానం ఎలా వుంటుందో చెబుతాను విను. ఈ కురుక్షేత్ర భూమిలోనే , ఎన్నో ఏళ్ళ క్రితం సక్తుప్రస్థుడు అనే మహాత్ముడు ఉండేవాడు. ఆయన , భార్య , కొడుకు , కోడలు నలుగురూ , జీవకోటిని కరుణతో , దయతో చూస్తూ , కామ క్రోధాలను విడిచి , ధర్మ బద్ధంగా జీవితాన్ని గడిపేవారు. అతిథి అభ్యాగతులను దేవుళ్ళవలె పూజించి ఆదరించి పంపేవారు. కేవలం జీవితాన్ని నిలుపుకోవడానికి ఎంత ఆహారం కావాలో అంత మాత్రమే తినేవారు. కడు పేదలైనప్పటికీ పరమేశ్వర ధ్యానంలో జీవితం గడిపేవారు. ఒక రోజు వారికి అతి తక్కువ ఆహారం దొరికింది. కేవలం ఒక రొట్టికి సరిపోయే పిండి మాత్రమే సమకూరినది. ఆ చిన్ని రొట్టెను నాలుగు భాగాలు చేసుకుని వారు తినడానికి సిద్ధమౌతున్న సమయంలో ఒక అతిథి వచ్చి *”తన ప్రాణం పోతోన్నదనీ , తనకు ఏదైనా ఆహారం ఇవ్వమనీ”* కోరాడు.

అప్పుడు సక్తుప్రస్థుడు తన వంతు రొట్టే ముక్కను ఇచ్చాడు. అది తిన్న అతిథి తన ఆకలి బాధ మరింత ఎక్కువైనదని చెప్పాడు. అప్పుడు ఆ కుటుంబంలోని అందరూ తమ వంతు రొట్టెను ఇచ్చి వేసారు. అవి తిన్న అతిథి తృప్తిగా వారిని దీవించాడు. “మీ అతిథి సత్కారం , అన్నదానం నాకు నచ్చాయి. మీరంతా ప్రాణాలు పోయేటంతటి ఆకలితో బాధపడుతూ కూడా , మీరు తినబోయే ఆహారం నాకు దానం చేసి , ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు. మీ దానబుద్దికి దేవతలు సంతోషిస్తారు. అన్ని లోకాలూ మిమ్ములను ప్రశంసిస్తాయి. దానము , భూత దయ ఈ రెండు వున్న మీకు మోక్షం లభిస్తుంది” అని దీవించాడు. అప్పుడు పరమాత్మ వారికొరకు పుష్పక విమానాన్ని పంపించాడు. వారు దివ్యలోకాలకు తరలి వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూసిన నేను , సక్తుప్రస్థుడు ఆ అతిథి కాళ్ళు కడిగిన నీటిలో అప్రయత్నంగా తిరిగాను. అప్పుడు నా శరీరం లో ఆ తడి తగిలిన సగ భాగం బంగారు రంగులోకి మారింది. దానమంటే అలా వుండాలి. అప్పటినించీ ఎన్నో దాన , ధర్మ ప్రదేశాలు తిరిగాను. అయినా నా రెండవ ప్రక్క బంగారు రంగు రాలేదు , ఇక్కడ కూడా రాలేదు” అని నవ్వుతూ వెళ్ళిపోయిందిట. అన్నదానము ఎలా చెయ్యాలో , ఎంత ప్రేమతో , దయతో , మాతృహృదయంతో , అపారమైన త్యాగ బుద్ధితో చెయ్యాలో ఈ కథ మనకు వివరిస్తుంది.

భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న రోజులవి. పద్ధెనిమిది వందల నలభైలనాటి మాట. అకాలంలో ఒక వూరినించి మరొక వూరికి ప్రయాణాలన్నీ బండ్ల మీద సాగుతూ వుండేవి. గమ్యం చేరుకోవడానికి కొన్ని రోజులు పట్టేది. మార్గ మధ్యంలో భోజనాలు దొరకక పెద్దలూ , పిల్లలూ ఎంతో ఇబ్బంది పడేవారు. హోటళ్ళు లేవు. కొందరు ధర్మాత్ములు కట్టించిన సత్రాలు ఉన్నా , అవి చాలా తక్కువమందికి మాత్రమే ఉపయోగపడేవి. ప్రతి సత్రానికి ఒక గుమాస్తా వుండేవాడు. అతని దయా దాక్షిణ్యాలపై సత్రం నిర్వహణ జరిగేది. అతను పద్దులు రాయటం పూర్తైన తరువాత , ఉదయం ఏ పన్నెండుగంటలకో ఒకసారి , తిరిగి రాత్రి ఒక సారి మాత్రమే భోజనం పెట్టేవారు. మిగితా సమయాలలో వచ్చిన వారికి మొండిచెయ్యే మిగిలేది. భోజనం పెట్టే
సమయంలో కూడా సూటి పోటి మాటలంటూ “తేరగా వచ్చిన తిండి , తినండి , మీకు రాసిపెట్టుంది మరి” అంటూ హేళన చేసేవారు. దానితో ప్రయాణీకులు ఈ సత్రాలకి రావడానికే భయపడి పస్తులతోనే ప్రయాణాలు సాగించేవారు. పిల్లలు ఆకలికి తాళలేక విలవిలలాడిపోయేవారు. “దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా భావించే” యే పేకాట రాయుళ్ళకో , వ్యసన పరులకో , సోమరులకో మాత్రమే బాగా ఉపయోగ పడేవి చాలా సత్రాలు.
అటువంటి కాలంలో అపర అన్నపూర్ణగా , నిరతాన్నదాత్రిగా ఖండాంతర కీర్తినార్జించిన శ్రీమతి డొక్కా సీతమ్మగారు జన్మించారు. ఆ మహా సాధ్వి గురించి “విబుధ జనులవలన విన్నంత కన్నంత , తెలియవచ్చినంత” వివరించాలనే ఉద్దేశ్యం తోనే ఈ వ్యాసానికి శ్రీకారం చుట్టాను. గొప్పలు చెప్పుకోవాలనో , కీర్తి చాటుకోవాలనో కాదు. కేవలం అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మగారి గురించి నాకు , మా వంశస్థులకు తెలిసిన వివరాలు , ఆసక్తి గలవారితో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో చేస్తున్న ప్రయత్నం ఇది. తప్పులుంటే పెద్దలు సవరించగలరు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పే ప్రవచనాలలో డొక్కా సీతమ్మగారిని గురించి చెప్పడం విన్న ఎంతో మంది నాకు , అన్నకు ఫోను చేసి , ఈమెయిలు చేసి , మరిన్ని వివరాలు కావాలని పదే పదే అడగడంతో , మావద్ద వున్న సమాచారం సేకరించి , ఈ వ్యాసంగా రాస్తున్నాను.

కోనసీమలో చతుర్వేదపారంగతులైన పండితోత్తములకు నిలయమైన పేరూరు అనే గ్రామము వుంది. అక్కడ ద్రావిడ వంశమునకు చెందిన శ్రీ డొక్కా వారి కుటుంబంలో శ్రీ డొక్కా జోగన్న గారు క్రీ.శ 1804 (రక్తాక్షి నామ సంవత్సరం) లో జన్మించారు. వీరి తండ్రి శ్రీ డొక్కా విశ్వేశ్వరుడు గారు , తల్లి శ్రీమతి సోదెమ్మ. విశ్వేశ్వరుడు గారికి ఐదుగురు మగ పిల్లలు. నాలుగవ వారు జోగన్న గారు.
1) సూరన్నగారు
2) నరసన్నగారు
3) సుబ్రహ్మణ్యం గారు
4) వెంకట జోగన్న గారు 5) జగ్గన్న గారు
సూరన్నగారు , నరసన్నగారు ఇల్లరికపుటల్లుళ్ళుగా వక్కలంక వెళిపోయారు. సుబ్రహ్మణ్యం గారు చిన్నప్పుడే చనిపోయారు. మిగిలిన వెంకట జోగన్న గారు , జగ్గన్న గారు లంకల గన్నవరములో వ్యవసాయము చేసుకొనే వారు. జోగన్న గారు వేద పండితులు. సదాచార సంపన్నులు. సాముద్రిక శాస్త్రమునందు నిపుణులు. వీరి మొదటి భార్య పేరు లక్ష్మీ దేవి. వారికి సూర్యనారాయణ అను కొడుకు పుట్టాడు. అయితే భార్య లక్ష్మి దేవి గారు , కుమారుడు సూర్యనారాయణ చనిపోయారు. అప్పుడు జోగన్న గారు సుబ్బమ్మను పెళ్ళిచేసుకున్నారు. కొంతకాలానికి ఆమె విశ్వేశ్వరుడను పిల్లవాడికి జన్మనిచ్చి చనిపోయారు. జోగన్న గారు ఎంతో విచారించి , ఎన్నో ఏళ్ళు ఒంటరిగా గడిపి కుమారుణ్ణి పెంచారు.
మండపేట గ్రామములోని అనప్పిండి భవానీ శంకరం గారు (బువ్వన్న గారు) , నరసమ్మ దంపతులకు జన్మించిన కుమార్తెయే సీతమ్మ గారు. డొక్కా సీతమ్మగారు 1841 (ప్లవ నామ సంవత్సరం) లో జన్మించారు. భవానీ శంకరం గారు వేద వేదాంగములను అభ్యసించిన మహా మేధావి. సీతమ్మ గారి పసితనమునందే నరసమ్మగారు చనిపోయారు. తల్లి లేని బిడ్డను భవానీ శంకరం గారే ఎంతో జాగ్రత్తగా పెంచారు. ఒక రోజు డొక్కా జోగన్న గారు వేద సభలలో చర్చలు చేసి , విజయులై , ఎన్నో సన్మానములను పొంది తిరిగి వస్తూ , మధ్యాహ్న భోజన సమయమునకు మండపేటకు చేరారు. ఆ వూరిలో వేద పండితులైన భవానీ శంకరం గారింట స్వయం పాకము చేసికొనవచ్చు కదా అని యోచించి వారింటికి వచ్చారు. ఆ సమయానికి భవానీ శంకరంగారు ఇంటిలో లేరు. వారి కుమార్తె సీతమ్మ గారు వున్నారు. సీతమ్మ గారు జోగన్న గారిని ఆదరించి , ఆయన స్వయంపాకమునకు కావలసిన సామాగ్రినంతయు సమకూర్చి ఇచ్చారు. జోగన్న గారు ఆ బాలిక త్యాగ బుద్ధికి , తెలివి తేటలకు , ఆదరణకు ముగ్ధులై స్వయంపాకము చేసుకొంటున్నారు. ఇంతలో భవానీ శంకరం గారు వచ్చి , మహాపండితులైన డొక్కా జోగన్న గారు తమ యింటికి వచ్చుట చూసి , అమితానంద పడి , వారిని ఆదరించి , ఎన్నోరీతుల సత్కరించి పంపారు. డొక్కా జోగన్న గారి వంటి పండితోత్తమునకు తన కూతురునిచ్చి పెండ్లి చేయాలని మనసులో సంకల్పము చేసుకొన్నారు. సీతమ్మ గారి చురుకుతనము , అణకువ , త్యాగ బుద్ధి చూసి , సాముద్రిక శాస్త్రము సూచించిన అనేక శుభలక్షణములు గలిగిన ఆ బాలికను వివాహము చేసుకొన్న బాగుండునని , ఆమె వున్న చోట ఏ కొఱత వుండదని , ఆ వంశమునకు చిర కీర్తి లభించునని గ్రహించిన జోగన్నగారు కూడా వివాహము చేసుకొన్నచో బాగుండునని తలచారు. పిమ్మట ఆచారము ప్రకారము భవానీ శంకరము గారు తమ వూరి పెద్దలను తోడ్కొని వచ్చి , వారి ద్వారా తన కుమర్తెను జోగన్నగారికిచ్చి పెండ్లి చేయవలెనను తమ ఆకాంక్షను జోగన్నగారికి తెలియజేసారు. ఆయన సమ్మతించారు. గృహస్థాశ్రమ విధులకూ , యజ్ఞ యాగాదులకు ఆటంకము కలుగకూడదనే ఉద్దేశ్యముతో , శ్రీ డొక్కా జోగన్న గారు 1850 (“సాధారణ” నామ సంవత్సరము) లో సీతమ్మగారిని వివాహమాడారు. వివాహం నాటికి సీతమ్మగారి తొమ్మిదేళ్ళు. చిన్నతనంలోనే సీతమ్మగారు అత్తవారింటికి వచ్చారు. పాడి పంటలకు లోటులేని కుటుంబము. ఎన్నో బాధ్యతలను అంత చిన్న వయసునుంచి , ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు సీతమ్మగారు. ఎంతమంది పనివారున్నా , ప్రతి పనీ స్వయముగా దగ్గరుండి చూసుకొనేవారు. ఊరిలో ఎవరికి ఏ ఆపదవచ్చినా అది తమదిగా భావించి , వారికి తగిన సహాయం చేసేవారు. మొదటిలో భర్త జోగన్నగారు ఏమనుకుంటారో అని కాస్త బెరుకుగా వుండేవారు. అయితే మహాపండితులైన జోగన్న గారు , అన్నదాన విషములయందు , పరోపకార విషయములయందు సీతమ్మగారిని ఎంతో ప్రోత్సహించేవారు. అప్పటినుండి వచ్చు పోవు వారికందరికీ భోజనములను ఏర్పాటు చేయుట విధిగా చేసేవారు సీతమ్మగారు. రేవులు దాటే సౌకర్యాలు సరిగా లేకపోవటం వలన , ప్రయాణ సౌకర్యాలు అంతగా లేకపోవడం వలన , ఎంతో మంది మార్గస్థులు లంకల గన్నవరం లో అగేవారు. సీతమ్మగారి ఖ్యాతి విని వారింటికి వచ్చేవారు. వారందరికీ మజ్జిగ తేటను , భోజనాలను , ఫలహారాలను సమకూర్చేవారు సీతమ్మగారు. సీతమ్మగారి అన్నదాన వ్రతమునకు వేళ లేదు. 24 గంటలలో ఎప్పుడు , ఏవేళ , ఎవరు వచ్చినా , వారి కడుపు నింపి , వారిని ఆదరించేవారు సీతమ్మగారు. ఇలా ఎన్నో యేళ్ళు చేయడం వల్ల ఆవిడ ఆరోగ్యము దెబ్బతింది. అయితే ఆవిషయం జోగన్నగారికి తెలియనీయలేదు. ఆవిడ క్రమముగా చిక్కి పోవడం గమనించిన జోగన్న గారు , సీతమ్మగారిని విశ్రాంతి తీసుకోమని చెప్పారు. వేళకు వచ్చిన వారికి భోజనము పెట్టుమని తక్కిన సమయంలో కాస్త విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే అతిథులకు , అన్నార్తులకు ఇబ్బంది కలుగుతుందని , తన ఆరోగ్యము బాగానే వున్నదని చెప్పి సీతమ్మగారు అన్నదాన వ్రతం కొనసాగించారు. జోగన్న గారు ఆవిడకు వంటలు వండడానికి సాయంగా కొంత మంది వంట బ్రాహ్మలను ఏర్పాటు చేసారు. వారే వండి వడ్డిస్తారని చెప్పారు. అయితే సీతమ్మగారు , వారు వండినప్పటికీ , వడ్డన మాత్రము తానే స్వయముగా చేసి , అందరికీ కొసరి కొసరి తినిపించేవారు. వేళ కాని వేళ వచ్చిన అతిథులకు వంట కూడా తానే చేసి , వడ్డించేవారు. అందరినీ బతిమాలి , బుజ్జగించి , వారి మొహమాటాన్ని పోగొట్టి , కన్న తల్లిలాగ అన్ని రకాల వంటలూ చేసి , వడ్డించి , దగ్గరుండి , కొసరి కొసరి తినిపించే వారు సీతమ్మగారు. ఒక గదిలో తరవాణి కుండలు పెట్టించి , చద్దెన్నము నిండుగ నింపి , ఏ అర్థరాత్రి ఎవరు వచ్చినా వారికి ముందుగా ఆ అన్నంపెట్టి , ఆకలి మంట చల్లార్చి , పిమ్మట వంట చేసి తృప్తిగా భోజనము పెట్టేవారు సీతమ్మగారు.
సీతమ్మగారికి , జోగన్నగారికి ఇద్దరు కుమారులు , ఇద్దరు కుమార్తెలు పుట్టారు.
1.సుబ్బారాయుడు గారు 2.గోపాలం గారు

  1. నరసమ్మ గారు (చాకుఱ్ఱు అయ్యగారి రామకృష్ణయ్య గారి భార్య)
  2. సోదెమ్మ గారు
    తమ పెద్ద కుమారుడైన సుబ్బారాయునకు, తన మరిదిగారైన జగ్గన్నగారి కూతురు కూతురు (మనుమరాలు) సుబ్బమ్మను ఇచ్చి పెండ్లిచేసారు సీతమ్మగారు.

అంతర్వేది ప్రయాణము – పెళ్ళివారి రాక

అన్నదానానికి భంగం కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఎన్నడూ ఇల్లు కదలని సీతమ్మగారు , ఒకే ఒక్క సారి , దగ్గరలోని అంతర్వేది నరసింహస్వామిని దర్శించుకుని రావాలనే కోరికతో మేనాలో బయలుదేరారు. మేనా కొంత దూరం వెళ్ళింది. బోయీలు ఓ పంట చేను పక్కన చెట్టువారగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో ఒక పెద్ద పెళ్ళివారి గుంపు వేరొక ఊరినించి వచ్చి అక్కడే విశ్రాంతి తీసుకుంది. ఆ గుంపులోని పెద్దలు , పిల్లలు ఆకలికి తాళలేకపోతున్నారు. పిల్లలు ఏడుపులందుకున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళను ఊరుకోబెడుతూ “ఏడవద్దు పిల్లలూ , మరి కాస్త సేపట్లో మనం డొక్కా సీతమ్మగారి ఇంటికెళిపోదాం. అక్కడ హాయిగా అందరమూ కడుపు నిండా భోజనం చేసి , హాయిగా విశ్రాంతి తీసుకుందాం” అంటున్నారు. ఈ మాట సీతమ్మగారి చెవిన పడింది. మానవ సేవే మాధవ సేవ అని గట్టిగా నమ్మిన ఆవిడ , మరుక్షణమే తన మేనాను వెనుకకు తిప్పి వీలైనంత వేగంగా ఇంటికి తీసుకుపొమ్మని బోయీలకు చెప్పారు. అడ్డదారిన , పెళ్ళి వారికంటే అరగంట ముందుగా ఇల్లుచేరారు ఆవిడ. అయినా అరగంటలో ఏమి వంట చేయగలరు ? అందునా సుమారు వందమంది పెళ్ళివారికి ? అందుకనే ఆవిడ ముందుగా అటక మీదనించి బెల్లం బుట్టలు దింపించి , శ్రీరామ నవమి రోజున దేవునకు అర్పించే బెల్లం పానకం తయారు చేయించారు. నాలుగు బుట్టల తియ్యటి మామిడి పండ్లను ముక్కలుగా కోయించి సిద్ధం చేయించారు. ఇంతలో పెళ్ళి వారి గుంపు వచ్చేసింది. వారంతా హాయిగా పానకములు త్రాగి , పండ్లు తిని కాస్త కుదుట పడ్డారు. ఇంతలో పంచ భక్ష్య పరవాన్నాలతో అతి రుచికరమైన , సంతృప్తికరమైన భోజనాలతో వారికి విందు చేసారు సీతమ్మగారు. సాయంత్రము పొలము నుండి తిరిగి వచ్చిన జోగన్న గారు ఆశ్చర్యపడి “అంతర్వేది వెళ్ళలేదా ?” అని సీతమ్మ గారిని అడిగారు. “ఇంతమందిని పస్తు పెట్టి , నేను దర్శనానికి వెడితే , ఆ నరసింహ స్వామి హర్షించడు. అందుకే తిరిగి వచ్చేసాను” అని చెప్పారు సీతమ్మగారు. అది విన్న జోగన్న గారు , ఆవిడ త్యాగ నిరతికి ఎంతో సంతోషించారు.

కోడూరుపాడు రాజు గారి కుమార్తె:

కోడూరుపాడు రాజుగారు గర్భిణీ అయిన తమకుమార్తెను పుట్టింటికి పురిటికి తీసుకువెడుతున్నారు. మధ్యలో కోడేరు రేవు దాటగానే ఆమెకు నొప్పులు వచ్చాయి. లంకల గన్నవరం వచ్చేసరికి నొప్పులు ఎక్కువయ్యయి. అప్పుడు వారిని సీతమ్మగారు తన ఇంట ఉంచుకొని , ఆ రాచ బిడ్డకు ఒక గది ప్రత్యేకముగా కేటాయించి , ఆమెకు పురుడు పోసారు. కన్న తల్లికన్న ఎక్కువగా పథ్యం భోజనాలు చేసి పెట్టి , ఒక నెల రోజులు తన ఇంటనే వుంచుకుని , అప్పుడు రాజు గారినీ , కుమార్తెనూ , మనుమరాలినీ చీర , సారె పెట్టి పసుపు కుంకుమలిచ్చి సాగనంపారు. ఊరిలో ఎవరింట బంధువులు వచ్చినా వారి ఇంటికి , పెరటి దారిన , కావలసిన కూరలు , వంట సామాగ్రి పంపేవారు. కాస్త పేదవారైతే వారి వారి పెళ్ళిళ్ళు తమ ఇంటి వద్దనే పందిళ్ళు వేయించి , తన స్వంత ఖర్చులతో వైభవంగా జరిపించేవారు. సీతమ్మగారు ఎన్నడూ కుల , మత , జాతి భేదములు పాటింపలేదు. నిరుపేదలు మొహమాట పడతారని గ్రహించి , వారికి తెలియకుండానే రహస్యంగా ఎన్నో సహాయాలు చేసేవారు. డొక్కా వారింటిలో అన్ని కులములవారు , జాతులవారు , మతములవారు , దేశములవారు సీతమ్మగారి అన్న ప్రసాదాన్ని తృప్తిగా ఆరగించేవారు.

వరహాల శెట్టి కథ:

బొంబాయి మహా నగరంలో ప్రసిద్ధిగాంచిన బంగారు వ్యాపారి ధనగుప్తుడు. విశేషంగా ధనం సంపాదించాడు. అతని కొడుకు నిగమ శర్మ లాంటి వరహాల శెట్టి. చిన్ననాటి నుంచి తల్లియొక్క అతిగారాబం వల్ల చెడిపోయి , జులాయిగా పెరిగాడు వరహాల శెట్టి. అతనికి లేని చెడ్డగుణము లేదు. పెళ్ళి చేసుకుని పిల్లవాణ్ణి కన్నాడు. అయినా అతని శైలిలో మార్పు రాలేదు. వేశ్య మోహంలో పడి భార్యను విడిచి , తన ఆస్తి వాటా గుంజుకొని , దానినీ తగలేసి , భ్రష్టుడై , జైలు పాలయి , ఎప్పటికో విడుదలయి , దొంగగామారి దేశ ద్రిమ్మరి అయ్యి , తిరిగి తిరిగి ఆంధ్ర దేశానికి వచ్చాడు. అప్పుడు ఆంధ్ర దేశములో వర్షాలు పడక కరువు పరిస్థితులు వున్నాయి. అతనికి పట్టెడన్నం పెట్టేవారే లేరు. అతను తిరిగి తిరిగి , చివరకు డొక్కా సీతమ్మగారి ఖ్యాతి విని , కడ ప్రాణాలతో లంకల గన్నవరం వచ్చి చేరాడు. అందరితో పాటు అతనికి కడుపునిండా అన్నం పెట్టారు సీతమ్మగారు. అతను హాయిగా తిని , పెరట్లోకి పోయి పశువుల శాల పక్కన పడుకునేవాడు. మళ్ళీ ఆకలివేసినప్పుడు వచ్చి పంక్తిలో కూర్చుని భోజనం చేసేవాడు. ఇలా కొన్ని రోజులైనతరువాత అతనికి దుర్భుద్ది కలిగింది. ఒక రాత్రి అతను సీతమ్మగారు ఆరవేసుకొన్న పట్టు చీర దొంగిలించి పారిపోబోయాడు. ఎవరిదో కాలు అడ్డు తగిలి కిందపడ్డాడు. అందరూ లేచి అతనిని స్థంభానికి కట్టేసారు. ఈ విషయం సీతమ్మగారికి తెలియదు. పొద్దున్న అవిడ లేచి ఎంతో బాధపడి , కట్లు విప్పి , వరహాల సెట్టిని విడిపించి “ఆ చీర నేనే అతనికి ఇచ్చాను” అని చెప్పి , అతనికి తల్లిలా తలంటు పోసి , కొత్త బట్టలు తెప్పించి ఇచ్చి గౌరవించారు. అతనికి తృప్తిగా మరల భోజనము పెట్టి , తన వద్దనున్న మొత్తం సొమ్ము యాభై రూపాయలను అతనికి ఇచ్చారు. అతని హృదయం కరిగిపోయింది. అతని దుర్గుణాలన్నీ అంతటితో నశించాయి. అతను సీతమ్మగారి పాదాలు పట్టుకుని చిన్నపిల్లవానివలె ఏడుస్తూ క్షమాపణ కోరాడు. ఆమె అతనిని ఓదార్చి ” విధిని తప్పించుకోలేము నాయనా. నీకు లేకపోవడం చేతనే కదా ఇలా తప్పు చేసావు. అందుకే ఈ యాభై రూపాయలతో ఏదైనా కొనుక్కో” మని తల్లిలా చెప్పారు. అప్పుడు వరహాల శెట్టి తన కథనంతా చెప్పి , తనను క్షమింపుమని వేడుకొని , సీతమ్మగారి ఆశీర్వచనములతో తన ఇల్లు చేరి , ఆ యాభై రూపాయలతో మరల వ్యాపారమును వృద్ధి పరచుకొని , దినదినాభివృద్ధి చెంది ఎంతో సంతోషముగా భార్యా బిడ్డలతో కాలంగడిపాడు. తనజీవితములో ఎప్పుడూ సీతమ్మగారు తనకు చేసిన మేలు మరువలేదు. వీలుకుదిరినప్పుడల్లా కుటుంబంతో వచ్చి సీతమ్మగారి దర్శనం చేసుకునేవాడు.

హరిజనునకు ప్రాణదానము:

ఒక వర్షాకాలపు నడి రాత్రి. తుఫాను సమయము. ఆకాశం నిండా నల్లని మబ్బులు. విపరీతమైన పోటులో వుంది గోదావరి. ఎవరూ పడవ కట్టడానికి సాహసించని సమయం అది. అటువంటి సమయంలో గోదావరిలోని దిబ్బలలోనుంచి ఒక గొంతు అతి దీనంగ వినబడింది “అమ్మా , సీతమ్మ తల్లీ , ఆకలితో కడుపు కాలిపోతోంది , ప్రేగులు మాడిపోతున్నాయమ్మా. హరిజనుణ్ణి తల్లీ , ఎవరూ నా గోడు వినేవారు లేరు. తల్లీ , పట్టెడన్నం పెట్టి నా ప్రాణాలు కాపాడమ్మా.” అప్పటికే ఇంటికి వచ్చిన అందరికీ భోజనాలు పెట్టి , ఇంకా ఎవరైనా తినకుండా మిగిలిపోయారా అని ఒక లాంతరు వేసుకుని వీధి అరుగుమీద చూస్తున్న సీతమ్మగారికి ఆ హరిజనుని ఆర్తనాదాలు వినపడ్డాయి. వెంటనే అతనికి భోజనం అరిటాకులలో కట్టి , కప్పుకోవడానికి రెండు బొంతలు , కట్టుకోవడానికి ఒక పొడి పంచె , వెలిగించుకోవడానికి నాలుగు లంక పొగాకు చుట్టలు ఒక సంచీలో సద్ది , జోగన్న గారికి ఇచ్చి , పడవ కట్టించుకుని వెళ్ళి , ఏరు దాటి , దిబ్బలలో వున్న అతనికి ఇచ్చి రమ్మన్నారు. “ఇంత తుఫానులో , ఈ అర్థరాత్రి ఎవరూ పడవకట్టరు , ఒక వేళ కట్టినా గోదావరి పోటు విపరీతంగా వుండడం వల్ల పడవ మునిగి ప్రాణాలు పోతాయి , కాబట్టి ఇప్పుడింత సాహసం చెయ్యడం ఎందుకు , రేపు ఉదయాన్నే వెడతాను” అని ఆగారు జోగన్నగారు. “రేపు ఉదయం వరకు అతను బతకడు , నేనే వెళ్ళి వస్తాను , నా ప్రాణాలు పోయినా పరవాలేదు” అని బయలుదేరారు సీతమ్మగారు. సీతమ్మగారి నిశ్చయం ఎరిగిన జోగన్న గారు , తానే బయలుదేరి వెళ్ళి , పడవ వాడిని బతిమాలి పడవకట్టించుకుని , దిబ్బలు చేరుకుని , అతనిని ఆ చిమ్మ చీకటిలో వెతికి పట్టుకుని , అతనికి భోజనం పెట్టి , పొడి బట్టలిచ్చి , ప్రాణాలు నిలిపారు. అతను జోగన్నగారి కాళ్ళు పట్టుకుని , సాష్టాంగ ప్రణామం చేసి , తన ప్రాణములు నిలిపినందులకు కృతజ్ఞతలు తెలిపాడు.

శ్రీమతి ముదునూరు పద్మావతమ్మగారికి మేలు చేయుట:

విజయనగరమనే గ్రామంలో శ్రీ ముదునూరి కృష్ణమరాజు గారిది పేరు ప్రఖ్యాతులు గల కుటుంబం. ఆయన భార్య శ్రీమతి పద్మావతమ్మ. వారికి లేకలేక ఒక మగ బిడ్డ పుట్టాడు. బారసాలనాడు ఉండుండి పద్మావతమ్మగారు పెద్ద కేక పెట్టి వెనక్కు పడిపోయారు. అప్పటినించీ ఎంతో వింతగా ప్రవర్తించేవారు. పిల్లవాణ్ణి విసిరేసేవారు. ఇంటికి వచ్చిన వారిని కొడుతూ , బెదిరిస్తూ , వెక్కిరిస్తూ చాలా చిత్రమైన చేష్టలు చేసేవారు. ఎంతోమంది వైద్యులు పరీక్షించినా ఏమీ కనుక్కోలేకపోయారు. ఆమెను ఒక గదిలో వేసి తాళం పెట్టారు. ఆమె అన్నం తినడము , నీళ్ళు తాగడమూ కూడా మానివేసారు. కోనసీమలో పేరుగాంచిన ఒక శాస్త్రిగారు వచ్చి , ఎన్నో జపములు , హోమములు చేసి , పద్మావతమ్మగారిని రప్పించి ఆమెపై విభూతి చల్లారు. అప్పుడు ఆమె వణుకుతూ శాస్త్రిగారి పాదాలపై పడి , రక్షించమని వేడుకుని , తాను బ్రహ్మ రాక్షసుడననీ , తనను డొక్కా సీతమ్మగారి వద్దకు తీసుకుని పొమ్మనీ , సీతమ్మగారు హరిజనుడి ప్రాణాలు కాపాడిన పుణ్య ఫలం తనకు ధారపోస్తే తనకు విముక్తి కలుగుతుందనీ చెప్పారు. అందరూ ఆమెను సీతమ్మగారి దగ్గరకు తెచ్చారు. తక్షణమే సీతమ్మగారు పండితులను పిలిచి , పద్మావతమ్మగారి చేతిలో ఆ పుణ్య ఫలాన్ని మంత్ర పూర్వకంగా ధారపోసారు. అంతటితో ఆబ్రహ్మరాక్షసుడు పద్మావతమ్మగారిని విడిచిపెట్టి , సీతమ్మగారికి తన పూర్వ జన్మ వృత్తాంతం ఇలా చెప్పాడుట.
*”తల్లీ , మేము బ్రాహ్మలము. ఇద్దరన్నదమ్ములము. మ తల్లి దండ్రులు చిన్నతనమునందే చనిపోయారు. నేను పెద్దవాణ్ణి కావడంతో నా తమ్ముడి పెంపకం నేనూ , నా భార్యా చూసుకునేవాళ్ళం. కొన్నాళ్ళకు నాకు ఆరుగురు కొడుకులు పుట్టారు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యేకొద్దీ , నాకు , నా భార్యకు దురాశ పెరిగిపోయింది. అస్తిలో నా తమ్ముడికి వాటా ఇవ్వడం మాకు ఇష్టం లేదు. అందుకని తీర్థ యాత్రల పేరుతో అతణ్ణి వేరే వూరు తీసుకెళ్ళి , అక్కడ అతనికి విషాహారం పెట్టి చంపేసాము. తిరిగి మావూరొచ్చి , తమ్ముడు విష జ్వరంతో చనిపోయాడని అందరికీ అబద్ధం చెప్పాము. అయితే నేను చేసిన పాపం నన్ను కట్టి కుడిపింది. నా ఆరోగ్యం శిధిలమై , నేను చనిపోయి , ఇలా బ్రహ్మ రాక్షసుడిగా పుట్టాను. అయితే , నా పూర్వ జన్మ సుకృతం వల్ల నాకు తరుణోపాయం గోచరించింది. చిన్నప్పుడు ఒక హరికథలో అన్నదాన మహత్యాన్ని గురించి చెబుతూ , ఒక శాస్త్రి గారు *” ఎవరికైనా బ్రహ్మ రాక్షసి పట్టినచో , వారికి త్రికరణ శుద్ధిగా ఒక రోజు చేసిన అన్నదాన పుణ్య ఫలాన్ని ధారపోస్తే , ఆ బ్రహ్మరాక్షసి విడిచిపోతుంది. అంతే కాక ఆ బ్రహ్మ రాక్షసి కి కూడా విముక్తి కలుగుతుంది”* అని అన్నారు. నా అదృష్ట వశాత్తూ నేను ఆ హరికథ విన్నాను. అది గుర్తుకు వచ్చి ఈవిధంగా ప్రవర్తించాను తల్లీ , నేటితో నీ దయ వలన నాకు విముక్తి కలిగింది , అని నమస్కరించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మరుక్షణమే డొక్కా వారి ఇంటికి కొద్ది దూరంలో వున్న రావి చెట్టు పెద్ద కొమ్మ ఫెళ ఫెళ మని శబ్దం చేస్తూ విరిగి పడిపోయింది. తమకు జరిగిన మేలుకు కృష్ణమరాజుగారు , పద్మావతమ్మగారు ఎంతో సంతోషించారు. ప్రతి సంవత్సరము లంకల గన్నవరానికి కుటుంబంతో సహా వచ్చి సీతమ్మగారి దర్శనం చేసుకునేవారు.
1873 శ్రీముఖ నామ సంవత్సరంలో జోగన్న గారి తమ్ముడు జగ్గన్న గారు చనిపోయారు. అప్పుడు జోగన్న గారికి 69 ఏళ్ళు. సీతమ్మగారికి 32 ఏళ్ళు. జగ్గన్న గారి కుమారుడైన నరసయ్య గారిని సీతమ్మగారు సొంత బిడ్డల వలె చూసుకున్నారు.
డొక్కావారి భూములన్నీ మెట్ట భూములు. వర్షాలు లేక వ్యవసాయాలు పాడయ్యాయి. పంటలు పండలేదు. ఎన్నో ఎకరములు గోదావరిలో కలసిపోయినవి. ఖర్చులు ఎక్కువయ్యాయి. మార్గస్థుల రాక ఎక్కువైంది. ఆదాయం తగ్గిపోయింది. రోజులు గడవడం చాలా భారంగా , ఎంతో ప్రయాసగా తయారయింది. అయినా అన్నదానవ్రతానికి ఏమాత్రమూ భంగము రాకుండా కాపాడుకుని వస్తున్నారు జోగన్న గారు , సీతమ్మ గారు. అటువంటి రోజులలో ఒక నాడు మిట్ట మధ్యాహ్న వేళ ఒక బ్రహ్మచారి బ్రాహ్మడు సీతమ్మగారి ఇల్లు వెతుక్కొని వచ్చాడు. అతను స్నానము , జపము పూర్తిచేసుకునే వేళకు భోజనం వడ్డించారు సీతమ్మగారు. అతను ఇలా అన్నాడు “అమ్మా , నేను వివాహం చేసుకోవాలి. సంబంధమైతే కుదిరింది గానీ , ఆ పిల్లకు నేనొక నగ చేయించి ఇస్తేనే వివాహం చేస్తారుట. నా వద్ద సొమ్ము లేదు. నేను ఈ ఒంటి బతుకుతో చాలా కష్టాలు పడుతున్నాను. వివాహం చేసుకుంటే నాకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి మీరు మీ మెడలో వున్న ఆ నగ ఇస్తేనే , నేను మీరు వడ్డించిన ఈ భోజనం తింటాను. లేకపోతే తినను”. ఇది విన్న జోగన్నగారు సీతమ్మగారిని లోపలికి పిలిచి ” మనము సామాన్య సంసారులము. ఇంటికెవరైనా వస్తే భోజనం మాత్రం పెట్టగల స్థోమత మనది , అంతేగానీ , కంటెలూ , కాసుల పేర్లూ ఎక్కడ ఈయగలము ? అయినా నీకు మిగిలినది అది ఒక్కటే నగ. దానిని ఇవ్వద్దు” అని చెప్పారు. విన్న సీతమ్మగారు జోగన్నగారి పాదాలపై పడి ” మీకు ఎదురుచెప్పడం నాకిష్టంలేదు. కానీ , అతిథి విష్ణుమూర్తితో సమానం. అతనికి భోజనం పెట్టి , తృప్తిగా పంపుదాము. అతని సంసారం నిలబడుతుంది. ఈ నగ వల్ల నాకేమి ప్రయోజనం ? ఇది అతనికి ఉపయోగపడుతుంది , నామాట వినండి” అని ఆయన్ని ఒప్పించి అతనికి నగ ఇచ్చి , భోజనము పెట్టి పంపించారు. తీరా చూస్తే ఆ నగ పీట కిందే వదిలి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మడు. అతనికోసం వూరంతా గాలింఛినా కనపడలేదు. దిగులుతో ఆరాత్రి సీతమ్మగారికి నిద్ర పట్టలేదు. ఎప్పటికో చిన్న కునుకు పట్టింది. అప్పుడు కలలో శ్రీమహా విష్ణువు కనిపించి ఆనాడు తానే అతిథిగా వచ్చానని చెప్పి , ఆమె చిత్త శుద్ధికి , త్యాగనిరతికి తాను సంతోషించాననీ , ఆమె కీర్తి కలకాలం నిలుస్తుందనీ చెప్పారట. సీతమ్మగారికి మెలకువ వచ్చి జోగన్న గారికి ఈవిషయాన్ని చెప్పారట. వారి సంతోషమునకు అంతులేదు. మరికొన్ని రోజులలో ఇంట్లోని ధనమంతా ఖర్చు అయిపోయింది. మరుసటి రోజు వచ్చే అతిథులకు భోజన వసతులు ఎలా చెయ్యాలో పాలుపోక జోగన్న గారు పొలంలో తచ్చాడుతున్నారు. పొలంలో రైతులు పొలం పని చేస్తూ , మట్టి బెల్లు విరిపిస్తున్నారు. ఇంతలో “ఖణేల్” మన్న శబ్దం జోగన్నగారికి మాత్రము వినిపించినది. ఆయన అంతటితో పని ఆపించి అందరినీ పంపేసారు. తనకు నమ్మకస్థుడైన ఒక పాలేరు సాయంతో అక్కడ తవ్వగా , ఒక కంచు మద్దెల బయట పడింది. దానిని ఇంటికి తెచ్చి పగులగొట్టి చూడగా , దానిలో బంగారపు మొహరీలు దొరికాయి. ఇదంతా దైవానుగ్రహంగా భావించి , తమ అన్నదాన వ్రతమునకు భంగము కలుగకుండా విష్ణుమూర్తి చేసిన ఏర్పాటుగా భావించారు. తిరిగి నిర్విఘ్నముగా ఎన్నో ఏళ్ళు అన్నదాన వ్రతం జరిపారు.
1881 (వృష నామ సంవత్సరం) సెప్టెంబరు మాసంలో జోగన్న గారు చనిపోయారు. చనిపోయేముందు పెద్ద పిల్లవడైన సుబ్బారాయుణ్ణి పిలిచి “తల్లి చేసే అన్నదాన కార్యక్రమానికి ఎప్పుడూ భంగం రానీయకు. తల్లి మాటకు ఎదురుచెప్పకు” అని చెప్పి , ప్రమాణం చేయించుకుని కన్నుమూసారు. సీతమ్మగారు ఎంతో దుఃఖించారు. అయినా గుండె రాయి చేసుకుని , అన్నదాన వ్రతానికి భంగం వాటిల్లకుండా రోజులు గడిపారు.

పోడూరు రాజుగారికి సహాయము:

ఒకసారి పోడూరు రాజుగారి పశువులకు గాళ్ళ వ్యాధి వచ్చింది. అందుచేత వాళ్ళ వ్యవసాయ పనులు ఆగిపోయాయి. అప్పుడు వారు సీతమ్మగారిని సహాయం కోరగా , తమ పశువులను పంపారు. రాజు గారి పశువులు లంకల గన్నవరానికి వచ్చాయి. సీతమ్మగారు వాటిని హాయిగా కొన్నాళ్ళు పోషించారు. వాటి వ్యాధి పూర్తిగా తగ్గిన పిమ్మట వాటిని పోడూరు పంపించారు. రాజుగారి వ్యవసాయానికి డొక్కా వారి పశువులు ఎంతగానో సహాయపడ్డాయి. రాజుగారు ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసారు. ఒక ఏడాది లంకల గన్నవరంలో కరువు పరిస్తితులు ఏర్పడి పంటలు పండలేదు. అన్నదానానికి భంగం కలుగకూడదనే ఉద్దేశ్యంతో సీతమ్మగారు తన తమ్ముడు అనప్పిండి సుబ్బారాయుడు గారిని , గన్నవరపు లింగమూర్తిగారిని పోడూరు రాజు గారివద్ద వంద బస్తాల ధాన్యము బదులు తెమ్మని , పంట వచ్చిన వెంటనే తిరిగి ఇచ్చేస్తామని చెప్పి పంపారు. రాజు గారు “సీతమ్మగారు తమకు చేసిన సహాయానికి తాము ఎంతో ఋణపడి వున్నాము” అని చెప్పి , వీరిద్దరినీ అమితంగా ఆదరించి , సత్కరించి , వారికి ఎంతో కాలము విందు చేసారు కానీ ధాన్యం మాట మట్లాడలేదు. ఒకనాడు వీరిద్దరూ తిరిగి లంకల గన్నవరం చేరుకుని ఆ మాట సీతమ్మగారితో చెప్పారు. సీతమ్మ గారు నవ్వి , “మీరు వెళ్ళిన రోజునే రాజుగారు నూరు బస్తాల ధాన్యమూ పంపారు. తిరిగి ఇవ్వ వద్దు అని చెప్పి మరీ పంపారు” అన్నారు. రాజుగారి గొప్ప మనసుకు వారిద్దరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు వద్దని చెప్పిననూ , పంటలు పండిన వెంటనే రాజుగారి వంద బస్తాల ధాన్యమూ వారికి పంపిచి , కృతజ్ఞతలు తెలియచేసారు సీతమ్మగారు. డొక్కా వారి వంశము ఎన్నడూ ఎవరివద్దనుండీ ఏమీ ఆశించలేదు. ప్రతిఫలమును కోరలేదు.

మశూచి వ్యాధి నయమగుట:

నెల్లూరు జిల్లా కుల్లూరు గ్రామస్థులు కొందరు ముత్యాలు , పగడాల వ్యాపార నిమిత్తమై లంకల గన్నవరము వచ్చేవారు. ఒక ఏడు లంకల గన్నవరములో అంటువ్యాధులు చాలా ఎక్కువయ్యాయి. వాటికి భయపడి ఊరిలోని చాలా మంది తాత్కాలికంగా ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఈ నెల్లూరు వ్యాపారులలో లక్కాకుల గోపాలము , ఇరుకుమాటి కృష్ణమూర్తి వడ్డీ వ్యాపారము కూడా చేస్తూ , ఏడాదికి ఆరు నెలలు లంకల గన్నవరంలోనే ఉండేవారు. వారికి మశూచికము సోకింది. వారి దగ్గరికి వెళ్ళడానికే అందరూ భయపడి వారిని వారి ప్రారబ్ధానికి విడిచిపెట్టేసారు. వారు ఆ వ్యాధితో ఎంతో బాధపడ్డారు. దగ్గరకు వచ్చి కాస్త సాయం చేసే నాథుడే లేడు. అప్పుడు సీతమ్మగారు ఈ విషయం తెలుసుకుని , తమ ఇంటికి దగ్గరగా వున్న ఒక ఖాళీ ఇంటిలో వారిని చేర్పించి , వారికి వైద్య సదుపాయాలు కల్పించి , వారి బాగోగులు చూస్తూ , ఎంతో సహాయం చేసారు. వారు త్వరలో పూర్తిగా కోలుకున్నారు. వారు నెల్లూరుకు వెళ్ళి కొద్ది నెలలలో ఎన్నో ముత్యాలు , పగడాలు , ఇతర కానుకలు తెచ్చి సీతమ్మగారికి ఇచ్చారు. సీతమ్మగారు ” నాయనా , నేను ప్రతిఫలం కోరి ఏపనీ చేయను. మీకు ఆయుర్దాయం వుండి మీరు బతికారు. ఇందులో నేను చేసినది ఏమీ లేదు”
అని వారి బహుమతులను పుచ్చుకొనలేదు. వారు ఎంతగానో అర్థించినను సీతమ్మగారు ప్రతిఫలము తీసుకొనుటకు అంగీకరించలేదు. అప్పుడు ఆవ్యాపారులు సీతమ్మగారి కుమారుడు సుబ్బారాయుడు గారిని తమ వూరు తీసుకుని వెళ్ళి ఊరేగింపు చేసి , ఎన్నో రీతుల వారిని ఆదరించి పంపారు.
అమరపురితో సమానమైన పేరూరు గ్రామంలో ఒకసారి తీవ్రమైన నీటి ఎద్దడి వచ్చింది. బావులలో నీరు తాగడానికి అనువుగాలేదు. అప్పుడు ఆగ్రామస్థులు సీతమ్మగారి వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పగా , ఆవిడ 50 రూపాయలిచ్చారు. ఆ డబ్బుతో నుయ్యి తవ్వగా , ఆ నూతిలో ఎంతో తియ్యటి నీళ్ళు వచ్చాయి. (నా చిన్నప్పుడు , ఒక వేసంగుల్లో మా లంకలగన్నవరంలో సీతమ్మగారి బావి లోంచి తోడిన నీళ్ళు నేను తాగాను. అవి కొబ్బరి బొండం నీళ్ళలాగ ఎంతో తియ్యగా వున్నాయి. పక్కన వున్న నూతులలో నీరు మామూలుగా చప్పగా వుంది. ఇది నాకు స్వీయ అనుభవం) . సీతమ్మగారి ఇంట భోజన ప్రసాదము తిన్నచో ఎంతో మేలుకలుగునని భావించి , లెఖ్ఖలేనంత మంది వచ్చి తృప్తిగా సీతమ్మగారి ఇంట భోజనం చేసేవారు. ఒక బ్రిటిష్ కలెక్టరుకు పిల్లలు లేరు. అతను సీతమ్మగారి అన్నదాన వ్రతము గురించి తెలుసుకుని , వారి ఇంటికి వచ్చి భోజనము చేసాడు. కొన్నాళ్ళకు అతనికి కొడుకు పుట్టాడు. అతను తన కుటుంబ సమేతంగా వచ్చి సీతమ్మగారికి నమస్కరించి కృతజ్ఞత తెలియ చేసాడు. ఈ కలెక్టరు ఒక సారి పిఠాపురం జమీందారు శ్రీ రాజారావు మహీపతి గంగాధర రామారావు బహద్దర్ గారి ఇంటిలో విందుకు హాజరయ్యాడు. అప్పుడు ఆయన జమీందారు గారితో సీతమ్మగారి గురించి చెప్పగా , రాజా గారు ఆశ్చర్యపడి , తనకు తెలియదని , త్వరలో సీతమ్మగారి దర్శనం చేసుకొంటామని చెప్పారు. ఎన్నో సత్రాలను కట్టించి , ఎంతో ధనం ఖర్చుపెడుతున్న మహారాజులకు అలభ్యమైన కీర్తి ఈ సామాన్య స్త్రీకి ఎలా వచ్చిందా అని రాజావారు ఆశ్చర్యపోయారు. త్వరలో రాజా వారు మారు వేషములో తన దివానుగారితో సహా లంకల గన్నవరము వచ్చి , సీతమ్మగారి వీధి అరుగు మీద పడుకున్నారు. జాతి , మత , కుల , ప్రాంత , దేశ భేదాలు లేకుండా , ఎంతో అణకువతో , ప్రేమతో సీతమ్మగారు స్వయంగా చేస్తున్న అన్నదానాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు , ముగ్ధులైపోయారు. పాలు కావలిసిన పిల్లలకు ఆవు పాలు , మజ్జిగ కావలిన పెద్దలకు మజ్జిగ తేట , భోజనములవారికి భోజనములు , ఫలహారములవారికి ఫలహారములు , పథ్యముల వారికి పథ్యం భోజనములు , ఇలా ఎవరికి కావలిసినవి వారికి , అన్ని వేళలా సీతమ్మగారు సమకూరుస్తున్నారు. రాత్రి పొద్దుపోయింది. సీతమ్మగారు ఒక హరికేను లాంతరు తీసుకుని అరుగుమీదకు వచ్చి , అక్కడ విశ్రాంతి తీసుకొంటున్న వారందరినీ “నాయనా , నువ్వు భోజనం చేసావా ? తల్లీ , నువ్వు ఫలహారం తిన్నావామ్మా?” అని అందరినీ అడుగుతున్నారు. మారు వేషములోనున్న రాజా గారిని అడిగారు. ఆయన మొహమాట పడడం గ్రహించి , “అయ్యో , మీరు భోజనము చేయలేదా. రండి , కాస్త భోజనం చేసి , అప్పుడు విశ్రాంతి తీసుకుందురు గాని” అని దివానుగారిని కూడా అడగ్గా , ఆయన సీతమ్మగారిని పరీక్షించదలచి” అమ్మా , నాకు జ్వరము గా ఉంది , ఆకలి లేదు , నోటికేమీ సయించట్లేదు” అని చెప్పారు. అప్పుడు సీతమ్మగారు “అలా అయితే మీకు పథ్యం పెడతాను , రండి బాబూ” అని వారిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళి మహారాజుగారికి అన్నీ వడ్డించి , దివాను గారికి చింతకాయ పఛ్ఛడి , నిమ్మకాయ ఊరగాయ వడ్డించి అవి తినేలోపు , బీరకాయ నేతిపోపు కూర తెచ్చి వడ్డించారు. మహరాజు గారికి పెరుగు , దివాను గారికి పథ్యము కనుక పాలు పోసారు. వారిద్దరికీ కొసరి కొసరి తినిపించారు. భోజనాలయ్యాక “నాయనా , బయట గాలి ఎక్కువగా ఉంది. మీకు పడదు. మీకు సావడిలో పక్కలు వేయిస్తాను , అక్కడే విశ్రాంతి తీసుకోండి” అని చెప్పి , వారికన్ని ఏర్పాట్లు చేసారు. తెల్లవారు ఝామున రాజుగారు , దివాను గారు లేచి గోదావరి కెళ్ళి స్నానం చేసి వచ్చే సరికి అప్పటికే సీతమ్మగారు వంట ప్రయత్నాలలో వున్నారు. చద్దెన్నం తినేవారికి హయిగా తరవాణికుండలోని అన్నము , ఊరగాయ వడ్డిస్తూ వారి కడుపు నింపుతున్నారు. ఇది చూసిన రాజుగారు “ఇక్కడ జరిగినట్లుగా ఇంకెక్కడా జరుగదు. ఏ మహారాజు ఎంత ధనం వెచ్చించినా కూడా ఇంత శ్రద్ధగా , ప్రేమగా అన్నదాన వ్రతము ఆచరించడం అసాధ్యం. ఈవిడ సాక్షాత్తూ కాశీ అన్నపూర్ణే “ అని నిశ్చయించుకుని , దివాను గారితో సహా సీతమ్మగారి పాదములపై పడి , తమ తప్పు క్షమింపమనీ , తాము మరువేషములో వున్న మహారాజులమనీ చెప్పారు. సీతమ్మగారు తలుపు చాటుకు వెళ్ళి “అయ్యో , నాయనా నాకు తెలియలేదు. మీకు తగిన సదుపాయాలు ఏర్పాటు చెయ్యలేకపోయాను , ఏమీ అనుకోవద్దు” అని బాధపడ్డారు. అప్పుడు గంగాధర రామారావు రాజు గారు తమకు ఏవిధమైన లోటూ జరగలేదని చెప్పి , “మీ అదరణ , వితరణ మాకు ఎంతో సంతోషం కలిగించాయి. మీకు ఒక గ్రామాన్ని రాసి ఇస్తాము , మీరు మీ అన్నదానాన్ని కొనసాగించండి” అని చెప్పారు. అప్పుడు సీతమ్మగారు “మీ దయకు చాలా కృతజ్ఞతలు. కానీ , ఇతరుల సహాయంతో అన్నదానం చేస్తే , అది అన్నాన్ని అమ్ముకోవడంతో సమానమౌతుంది. దానివల్ల దుర్గతులు ప్రాప్తిస్తాయి నాయనా. అందుచేత నేను ఈ దానాన్ని స్వీకరించలేను , క్షమించండి” అని సున్నితంగా తిరస్కరించారు. చేసేది లేక రాజుగారు సీతమ్మగారికి కృతజ్ఞతలు తెలిపి దివానుగారితో సహా తమ సంస్థానానికి వెళ్ళిపోయారు.

బ్రిటిష్ చక్రవర్తి ఏడవ ఎడ్వర్డు గారి పట్టాభిషేకమునకు ఆహ్వానము:

సీతమ్మగారి చరిత్ర , ఖ్యాతి ఇంగ్లాండువరకు వ్యాపించింది. అప్పడు భారత దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ చక్రవర్తి ఏడవ ఎడ్వర్డు గారు సీతమ్మగారి ప్రఖ్యాతి విని , ఏటా ఢిల్లీ లో జరుగు తన పట్టాభిషేకోత్సవమునకు ఆహ్వానము పంపారు. 1902 డిశెంబరులో సీతమ్మగారికి పట్టాభిషేక ఆహ్వానం వచ్చింది. అప్పటికి సీతమ్మగారికి 61 ఏళ్ళు. ఆవిడ తను పొగడ్తల కొరకో , పేరు కొరకో అన్నదానము చేయుటలేదని విన్నవించి , పట్టాభిషేకమునకు వెళ్ళలేదు. అప్పుడు చక్రవర్తి తన రాజ ప్రతినిథిని డొక్కా సీతమ్మగారి ఫొటో తీయించి పంపవలసిందిగా ఆదేశించారు. ఆమె దానికి కుడా ఒప్పుకోలేదు. చివరికి మెజిస్ట్రేటు వచ్చి , ఫొటో పంపనిచో తన ఉద్యోగం పోతుందని బతిమాలడంతో , ఇక తప్పదని గ్రహించి , సీతమ్మగారు ఫొటో ఇవ్వడానికి ఒప్పుకున్నారు. “నాకు లేని పోని ఘనతలు కల్పించి నన్ను బాధించవద్దు , క్షమింపుము” అని ఆవిడ కలెక్టరును , మెజిస్ట్రేటును వేడుకుని , వారిని సత్కరించి పంపేసారు. ఫొటో చక్రవర్తిగారికి చేరింది. దానిని పెద్ద పటము కట్టించి , 1903 జనవరి ఒకటవ తేడీన ఢిల్లీ లో జరిగిన తన పట్టాభిషేకమహోత్సవంలో తమ సింహాసనానికి ఎదురుగా ఆ ఫొటోను ముఖ్య అతిథుల వరుసలో వేరొక సింహాసనం పై ఉంచి గౌరవించారు. సీతమ్మగారి త్యాగాన్ని గూర్చి ఒక యోగ్యతా పత్రాన్ని గవర్నర్ జనరల్ ద్వారా పంపారు. శివకోడు తహసీల్దారు గారు వి.పి.పద్మనాభరాజు గారు మార్చ్ 15, 1903 నాడు ఆ యోగ్యతాపత్రాన్ని సీతమ్మగారికి అందజేసారు. సీతమ్మగారు ఆయనతో “నాయనా , మానవసేవే మాధవ సేవ అని నమ్మి నేను నా విధి నిర్వహిస్తున్నాను. నాకెందుకీ యోగ్యతా పత్రాలు ? దేవుడి దయవల్ల నా అన్నదానానికి ఇంతవరకూ ఎటువంటి లోటూ జరగలేదు” అన్నారు. ఆ తహసీల్దారుగారు సీతమ్మగారికి సాష్టాంగ ప్రణామం చేసి , నచ్చ చెప్పి , తన విధి తాను చేస్తున్నాను అని ఒప్పించి , ఆ యోగ్యతా పత్రం అందినట్లు రసీదు తీసుకుని వెళ్ళిపోయారు. ఇలా ప్రతి సంవత్సరం డొక్కా సీతమ్మగారికి బ్రిటిష్ చక్రవర్తిగారి పట్టాభిషేక ఆహ్వానాలు అందుతూనే వున్నాయి. ఇది భారతదేశంలో మరెవ్వరికీ దక్కని అరుదైన గౌరవం.
1908 లో సీతమ్మగారికి 68 ఏళ్ళ వయసులో చేతిమీద కేన్సర్ వచ్చినది. పెద్ద వైద్యం చేయించాలని సుబ్బారాయుడుగారు ప్రయత్నించారు. కానీ సీతమ్మ గారు ఒప్పుకోలేదు. *”ప్రారభ్దాన్ని అనుభవించి తీరాలి కానీ , తప్పించుకోకూడదు. కర్మ ఫలితం వల్లనే సుఖ దుఃఖాలు , లాభ నష్టాలు కలుగుతాయి. *ప్రారబ్ధం భోగతో నశ్యేత్ – పారబ్ధమనేది అనుభవించడం వల్లే తీరుతుంది”* అని చెప్పి వైద్యం చేయించుకోవడానికి అంగీకరించలేదు. సుబ్బారాయుడు గారితో “నాయనా , నేను వెళ్ళిపోతున్నాను. మీకెన్ని కష్టాలు వచ్చినా అన్నదానం మానద్దు. అన్నం పెట్టేప్పుడు కులం , మతం , ప్రాంతం , జాతి – ఏమీ చూడద్దు. వాటిని మనం పాటించకూడదు. అన్నదానాన్ని మించినది మరొకటి లేదు. నువ్వు అన్నదానం నిర్విఘ్నంగా చేస్తానని నా చేతిలో చెయ్యేసి మాటియ్యి. అప్పుడు నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను” అని ఒట్టు వేయించుకున్నారు సీతమ్మగారు. ఏప్రిల్ 28 , 1909 వైశాఖ శుద్ధ నవమీ బుధవారం నాడు, మధ్యాహ్నం 12 గంటలకు సీతమ్మగారు లంకల గన్నవరంలో తమ ఇంట్లో కుటుంబాన్ని , ఆశ్రితులనీ , గ్రామస్థులనీ అందరినీ విడిచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అదే సమయంలో దగ్గరలోని ఇందుపల్లి గ్రామం లో శ్రీ మంథా నరసింహ మూర్తి గారి ఇంటి దగ్గర శ్రీ కాలనాథభట్ల వెంకయ్య గారు “పఠాను” ఏకపాత్రాభినయం చేస్తున్నారు. మహా పండితులు శ్రీ.వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు ఆ ఏకపాత్రాభినయాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఇంతలో ఆకాశంలో ఒక గొప్ప తేజస్సు పడమర నించి తూర్పుకి ఒక గుండ్రని బంతిలా అమితమైన వేగంతో వెళ్ళడం చూసి ” ఎవరో గొప్ప వ్యక్తి మరణించారు” అన్నారు శాస్త్రి గారు. కొద్దిసేపటికే డొక్కా సీతమ్మగారు చనిపోయారనే వార్త దావానలంలా వ్యాపించింది.
తల్లికి ఇచ్చిన మాట ప్రకారము సుబ్బారాయుడుగారు అన్నదానవ్రతాన్ని కొనసాగించారు. పట్టాభిషేక ఆహ్వానాలు వస్తూనే వుండేవి. ఎన్నో భూములు హరిజన వాడలకు ఇచ్చేసారు. ఆస్తులు కరిగిపోయినా , భూములు , వ్యవసాయము లేకపోయినా అన్నదానము కొనసాగించారు.
సుబ్బారాయుడు (భార్య సుబ్బమ్మ గారు) గారి కుమారులు 1.రామ జోగన్న గారు
2.సూరన్న గారు 3.రామభద్రుడు గారు
1917 సెప్టెంబరు లో (పింగళ నామ సంవత్సరం భాద్రపద శుద్ధ త్రయోదశి నాడు) సుబ్బారాయుడు గారు చనిపోయారు. కాలక్రమేణా ఆస్తులు కరిగిపోయి , భూములు లేక , వ్యవసాయము లేక పోయినా , తమ శక్తి కొలది సీతమ్మగారి మనుమలు , మునిమనుమలు , డొక్కా వంశస్థులు అందరూ తమకు తోచిన రీతిలో అతిథులనూ , అభ్యాగతులనూ ఆదరించారు , ఆదరిస్తున్నారు.
ఈ నా రచనకి శ్రీ మిర్తిపాటి సీతారామ చయనులు గారు అరవై సంవత్సరాల క్రిందట వ్రాసిన “శ్రీ నిరతాన్నదాత్రి డొక్కా డొక్కా సీతమ్మగారి జీవిత చరిత్ర” అనే పుస్తకం ఎంతో ఉపయోగపడింది. వారికి , వారి వంశస్థులకూ సదా కృతజ్ఞుణ్ణి.
కాశీలో గర్భగుడిలో సీతమ్మగారి ఫొటో కొన్నాళ్ళు వుండేదని పెద్దలు చెప్పగా విన్నాను. అలాగే మా స్నేహితుని తల్లిదండ్రులు కొన్నేళ్ళక్రితం కాశీలోని చింతామణి గణపతి ఆలయంలో హోమం , యజ్ఞం చేయించారు. అప్పుడు అక్కడి శిలాఫలకంపై “చింతామణి గణపతి ఆలయానికి లంకల గన్నవరం డొక్కా వంశస్థులు మాన్యపు భూములను ఇచ్చారు” అని వున్నదట. ఆయన (మా అట్లాంటా లోనే వున్న) వాళ్ళ అబ్బాయికి చెప్పగా , అతను నాకు చెప్పిన విషయం ఇది.
రెండు దశాబ్దాల క్రితం వరకు తెలుగు వాచకంలో డొక్కా సీతమ్మగారిపై పాఠం వుండేది. ఇప్పుడు లేదు. సీతమ్మగారి సేవలను గుర్తించి , కొన్నేళ్ళ క్రితం , గన్నవరం అక్విడెట్టు వద్ద , సీతమ్మగారి శిలా విగ్రహం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికీ , రాజకీయనాయకులకు , సహృదయిలైన ప్రజలకు అందరకూ కృతజ్ఞతలు. నేటికీ సీతమ్మగారిని తమ గుండెలలో నిలుపుకుని , ఆమె చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని , ఆమె జీవితాన్ని కథలుగా , నాటకాలుగా , పద్య రూపకాలుగా అందరికీ అందిస్తున్న కవి పండితులకూ , ప్రతినిత్యమూ సీతమ్మగారిని స్మరించుకుంటూ , సాటి మనుషులకు సహాయపడుతున్న తెలుగువారందరికీ శిరసా ప్రణామం చేస్తున్నాను.

నా పరిచయం:

నేను డొక్కా సీతమ్మగారి మనవడికి మనవడిని. డొక్కా సీతమ్మగారి మనుమడు (సుబ్బారాయుడి గారి కొడుకు) శ్రీ.డొక్కా రామభద్రుడు గారు మా తాతగారు. మా నాన్నగారి పేరు శ్రీ.డొక్కా సూర్యనారాయణ గారు. అమ్మపేరు శ్రీమతి.గంటి బాలా త్రిపుర సుందరి. నా పేరు డొక్కా శ్రీనివాస ఫణి కుమార్ (డొక్కా ఫణి). నేను గత రెండు దశాబ్దాలుగా అమెరికాలోని అట్లాంటాలో వుంటున్నాను. మా అన్న పేరు శ్రీ.డొక్కా రామభద్ర. తమ్ముడి పేరు డొక్కా వంశీ కృష్ణ.
(ఈ వ్యాసం మా లంకల గన్నవరం లో కొలువైన మా దైవం శ్రీ.రాజగోపాలస్వామికి అంకితం. )

Total Page Visits: 67 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *